Sat Nov 23 2024 12:48:29 GMT+0000 (Coordinated Universal Time)
తన ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. మరొకరిని చంపిన ప్రభుత్వ ఉద్యోగి.. ఆఖరికి ఇలా
మృతదేహాన్ని కారులో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని వాగు వద్దకు తీసుకెళ్లి.. కారుపై..
ఈ మధ్యకాలంలో.. జీవిత భాగస్వాముల ఇన్సూరెన్స్ సొమ్ముకోసం.. తామే హత్య చేసి.. తమకు ఏమీ తెలియదన్నట్టుగా వ్యవహరించిన కొన్ని ఘటనలు చూశాం. కానీ.. ఈ హత్య అంతకుమించి ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. తన పేరుపై ఉన్న రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తన కుటుంబంతో కలిసి పన్నాగం పన్నాడు. మరో వ్యక్తిని చంపి.. ఆ మృతదేహాన్ని కుటుంబసభ్యులచే తనదేనని నమ్మించే ప్రయత్నంలో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధాన నిందితుడు ధర్మా నాయక్ తెలంగాణ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా పనిచేస్తున్నాడు. స్టాక్ మార్కెట్ లో రూ.85 లక్షలు నష్టం రావడంతో.. భార్య, బంధువులతో కలిసి ఇన్సూరెన్స్ డబ్బుకోసం పథకం వేశాడు. తన పేరుపై ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుని అప్పులు తీర్చేందుకు.. ఓ కూలీని హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని వాగు వద్దకు తీసుకెళ్లి.. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా దగ్ధమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారువద్ద ఉన్న ఓ బ్యాగులో లభించిన ఐడీ కార్డు ఆధారంగా మృతుడు ప్రభుత్వ ఉద్యోగి అని భావించారు.
కానీ.. మృతడి కాలు.. కూలి పనులు చేసుకునేవారిదిలా ఉండటంతో పాటు.. ధర్మా నాయక్ కుటుంబ సభ్యుల ప్రవర్తనపై అనుమానం కలిగింది. దాంతో మరింత లోతుగా విచారణ చేయడంతో.. అసలు విషయం బయటపడింది. చనిపోయాడనుకున్న ధర్మా నాయక్ బతికే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని మహారాష్ట్రలోని పూణేలో అదుపులోకి తీసుకున్నారు. ధర్మానాయక్ ను విచారించగా.. నిజం తెలిసింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తాము చేసిందంతూ.. పోలీసులకు వివరించాడు. ఈ కేసులో ధర్మానాయక్, అతని భార్య, ఇద్దరు బంధువులు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా.. కోర్టు రిమాండ్ విధించింది.
Next Story