Fri Nov 22 2024 09:33:45 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మమ్మ.. పాము కాటు.. కోటి రూపాయలు డబ్బులు.. ఇదీ అసలు స్టోరీ!!
బీమా డబ్బుల కోసం కొందరు ఎంత దారుణాలకు పాల్పడడానికైనా సిద్ధమవుతూ
బీమా డబ్బుల కోసం కొందరు ఎంత దారుణాలకు పాల్పడడానికైనా సిద్ధమవుతూ ఉంటారు. బీమా డబ్బులను కాజేయాలని కొందరు చేసే దారుణాలను మనం అసలు ఊహించలేము. అలా ఓ వ్యక్తి అమ్మమ్మను బీమా డబ్బుల కోసం చంపేశాడు. అయితే అందుకు అతడు పాములు పట్టే వ్యక్తితో సుపారీ మాట్లాడుకున్నాడు. అనుకున్నట్లుగానే అమ్మమ్మను చంపేశాడు.. కానీ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి పఠారియా అనే మహిళ 8 నెలల క్రితం పాము కాటుతో చనిపోయింది. రూ.1 కోటి బీమా సొమ్ము కోసం మనవడే ఈ దారుణానికి పాల్పడ్డాడని బయటపడింది. నిందితుడు ఆకాశ్ ఓ పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారీ ఇచ్చి పాము కాటుతో చంపించాడని పోలీసులు తెలుసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మహిళ మృతిపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుడు ఆకాశ్ ప్రవర్తనపై సందేహం కలిగింది. మహిళకు పాముకాటు కూడా సాధారణంగా లేదని పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. పోలీసులు తమదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిందితుడు ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడు. బీమా సొమ్ము కోసమే ఈ పన్నాగం పన్నినట్టు వెల్లడించాడు. ఈ హత్యలో నిందితుడితో పాటు బీమా ఏజెంట్ పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు ఆకాశ్, బీమా ఏజెంట్, పాముల పట్టే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అమ్మమ్మ చనిపోయాక నిందితుడు రూ.1 కోటి బీమా సొమ్ము అందుకున్నాడు. అతడి నుంచి రూ.10 లక్షల నగదు, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కోటీశ్వరుడు అవ్వాలనే ఆశ ఆకాశ్ తో ఈ పని చేసిందని స్థానికులు చెబుతూ వచ్చారు.
Next Story