Fri Dec 20 2024 14:00:27 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీ కొట్టింది. దాంతో భార్య రోడ్డుపై దూరంగా పడగా..
ఢిల్లీలో న్యూ ఇయర్ రోజున అంజలి సింగ్ అనే యువతిని కారు ఢీ కొని, కొద్దికిలోమీటర్ల మేర లాక్కెళ్లగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా అదే తరహా ఘటన తాజాగా గుజరాత్ లో జరిగింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో అతను కారు కింద చిక్కుకుపోయాడు. కారు అంతటితో ఆగకుండా.. 12 కిలోమీటర్ల మేర యువకుడిని ఈడ్చుకెళ్లడంతో అతను మరణించాడు. ఈనెల 18న సూరత్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్వినిబెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీ కొట్టింది. దాంతో భార్య రోడ్డుపై దూరంగా పడగా.. సాగర్ కారు కింద చిక్కుకున్నాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా అలాగే డ్రైవ్ చేస్తూ.. 12 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. కారు కింద చిక్కుకున్న సాగర్ తీవ్రగాయాలతో మరణించాడు. అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ అశ్వినిని అప్పటికే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనను ఒక వ్యక్తి వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story