Tue Jan 07 2025 02:35:39 GMT+0000 (Coordinated Universal Time)
11 ఏళ్లు సహజీవనం.. అనుమానంతో తల్లీ - కూతురిపై..
పెదవడ్లపూడికి చెందిన మహిళ అదే గ్రామానికి చెందిన చేకూరి సురేష్ తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు 13 ఏళ్ల వయస్సున్న కూతురు కూడా
వివాహేతర బంధం, అక్రమ సంబంధం, సహజీవనం.. ఇలా పేరేదైనా ముగింపు ఉండాల్సిందే. అయితే.. ఈ ముగింపు అందరినీ సంతోషపెట్టేదైతే బాగానే ఉంటుంది. కానీ జరగరానిదేదైనా జరిగితే.. జీవితాలే తలకిందులైపోతాయి. దాంపత్య జీవితాన్నిఅపహాస్యం చేస్తూ.. గుట్టుగా నడిపే ఈ బంధాలు ఒక్కోసారి హత్యలు చేసేందుకుకూడా ప్రేరేపిస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు.. 11 ఏళ్లు సహజీవనం చేశారు. ఉన్నన్నాళ్లు బాగానే ఉన్నారు. ఏమైందో ఏమోగాని అతనిలో అనుమానపు భూతం బయటికొచ్చింది. ఫలితంగా ప్రియురాలిపైనే హత్యాయత్నం చేయడంతో.. షాక్ కు గురవ్వడం ఆమె వంతైంది. వివరాల్లోకి వెళ్తే..
అనుమానం పెనుభూతమై..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మహిళ అదే గ్రామానికి చెందిన చేకూరి సురేష్ తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు 13 ఏళ్ల వయస్సున్న కూతురు కూడా ఉంది. 11 ఏళ్లుగా ఇద్దరూ హాయిగా గడిపేశారు. కానీ.. అతనిలో చెలరేగిన అనుమానం.. ఆ మహిళ పాలిట శాపమైంది. నాతో ఉంటూనే ఇతరులతో తిరుగుతున్నావంటూ గొడవలు పడటం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్యా ఈ విషయమై పలుసార్లు వాగ్వాదం కూడా జరిగింది. ప్రియురాలు తనను మోసం చేస్తుందని భావించిన సురేష్.. ఎలాగైనా ఆమెను హతమార్చాలనుకున్నాడు. అనుకున్న విధంగానే ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున తల్లీకూతుళ్లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బయట గడియ పెట్టి ఇంటికి నిప్పంటించాడు. నిద్రలో ఉన్న తల్లికూతుళ్లకు మంటల వేడి తగలడంతో.. కళ్లు తెరిచి చూశారు. ఇల్లంతా తగలబడిపోతుండటంతో కేకలు పెట్టారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇద్దరినీ రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అక్రమ సంబంధంతో జైలుపాలైన సురేష్..
ఇదంతా సురేష్ చేశాడని గ్రహించిన మహిళ.. అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లై ఆ మహిళకు ఒక కూతురుంది. ఇటు సురేష్ కు భార్యా - పిల్లలు ఉన్నారు. అయినా క్షణికానందం కోసం అక్రమ సంబంధం పెట్టుకున్న సురేష్ ఆఖరికి జైలు పాలవ్వగా.. అతని కుటుంబం మగదిక్కులేని కుటుంబంగా మిగిలింది.
Next Story