Mon Dec 23 2024 06:50:31 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య పై హత్యాయత్నం.. గుప్పెడంత మనసు సీరియల్ నటి అరెస్ట్
హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తోన్న నాగవర్థిని కటకటాల పాలైంది. సీరియల్స్ లో ట్విస్టులు మీద ట్విస్టులు వస్తుంటాయి. అలాంటి సీరియల్స్ లో నటించే వర్థిని.. నిజజీవితంలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిపై హత్యాయత్నం చేయడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజా ప్రియుడు శ్రీనుతో కలిసి మాజీ ప్రియుడు సూర్యనారాయణను హతమార్చేందుకు యత్నించిన నాగవర్ధినిని, శ్రీనుని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంజారాహిల్స్ పరిధిలోని కృష్ణానగర్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ సినిమాలపై ఆసక్తితో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న సూర్య.. కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ నాగవర్ధినితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో.. సహజీవనం కూడా చేశారు. సూర్య గతం నుంచీ నివాసం ఉంటున్న బిల్డింగ్‌లోనే రెండో అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకొని నాగవర్ధినితో కలిసి ఉన్నాడు.
కొంతకాలం క్రితం ఇద్దరి మధ్యన మనస్పర్థలు ఏర్పడటంతో.. విడిపోయారు. అదే బిల్డింగ్‌లో సూర్య నాలుగో ఫ్లోర్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మరోవైపు, రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో నాగవర్ధిని పరిచయం ఏర్పడింది. నాలుగు నెలలుగా వారిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య.. నాగవర్థినిని నిలదీశాడు. శ్రీనివాస్ రెడ్డిని వదిలేసి తనతో వచ్చేయాలని హెచ్చరించాడు. ఆదివారం రాత్రి కూడా సూర్య నారాయణ నాగవర్థిని ఇంట్లోకి వెళ్లాడు. లోపల శ్రీనివాస్ రెడ్డితో ఆమె కలిసి ఉండటాన్ని చూసిన సూర్య.. గొడవపెట్టుకున్నాడు. సూర్యనారాయణను ఇంట్లో నుంచి వరండాలోకి తీసుకొచ్చిన శ్రీను, నాగవర్ధిని.. ఆ తర్వాత పైనుండీ తోసేశారు. దాంతో సూర్య రెండో అంతస్తు నుండీ కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన సూర్యను బంజారాహిల్స్ పోలీసులు పంజాగుట్టలోని ఓ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నాగవర్థిని, శ్రీను లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు.
Next Story