Mon Dec 23 2024 02:21:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో పరువు హత్య.. కూతుర్ని కడతేర్చిన తండ్రి
తండ్రి మాటల్ని వినిపించుకోని గీత.. తన ప్రేమను కంటిన్యూ చేసింది. కూతురు తన మాట లెక్కచేయలేదన్న విషయం తెలుసుకున్న..
ప్రేమలు, కులాంతర- మతాంతర వివాహాల కారణంగా పరువు హత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపింది. కూతురు.. ప్రేమలో పడటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కన్నతండ్రే కూతుర్ని విచక్షణా రహితంగా నరికి చంపిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో కలకలం రేపింది. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ముగ్గురు పిల్లలు. గీత(15) 10వ తరగతి చదువుకుంటుంది.
అదే గ్రామానికి చెందిన యువకుడితో గీత ప్రేమలో పడింది. ఈ విషయం తండ్రి రాజశేఖర్ దృష్టికి వచ్చింది. కూతురిపై కన్నెర్ర చేశాడు. ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీయకంటూ హెచ్చరించాడు. తండ్రి మాటల్ని వినిపించుకోని గీత.. తన ప్రేమను కంటిన్యూ చేసింది. కూతురు తన మాట లెక్కచేయలేదన్న విషయం తెలుసుకున్న తండ్రి..అవకాశం కోసం ఎదురుచూశాడు. మంగళవారం తల్లి పొలం పనులకు వెళ్లగా.. మరో కుమార్తె, కొడుకు కూడా బయటికి వెళ్లారు. అదే సమయంలో గీతకు మరోసారి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు రాజశేఖర్. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురై.. విచక్షణ కోల్పోయిన రాజశేఖర్.. గీత కాళ్లు, చేతులు కట్టేసి అతిదారుణంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడిన గీత అక్కడికక్కడే మరణించింది.
కాగా.. గీత ప్రేమించిన యువకుడు వారి కులానికి చెందినవాడేనని.. పైగా బంధువు కూడా అని తెలుస్తోంది. రెండుమూడ్రోజులుగా వారింట్లో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గీత హత్యతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలిసిన గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు. కూతురిని హత్య చేసిన అనంతరం రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
Next Story