Mon Dec 23 2024 03:35:39 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో పరువుహత్య కలకలం.. కూతురిని చంపి, తల-మొండెం వేరుచేసిన తండ్రి
ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో తన పరువు పోయిందని..
రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న కుమార్తె.. ఇటీవలే ఊరికొచ్చింది. తిరిగి మళ్లీ భర్త వద్దకు వెళ్లలేదు. కూతురి ప్రవర్తనతో ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నామని భావించిన తండ్రి.. ఆమెను చంపేసి తల, మొండేన్ని వేరు చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలుండగా.. పెద్దమ్మాయి ప్రసన్న (21)కు రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో వివాహం జరిగింది.
అయితే పెళ్లికి ముందు ప్రసన్న మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లయ్యాక కూడా అతడిని మరచిపోలేకపోయింది. ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో తన పరువు పోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన దేవేంద్రరెడ్డి ఫిబ్రవరి 10న కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. కొందరితో కలిసి కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కుమార్తె తల, మొండేన్ని వేరు చేసి పడేశారు. ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చాడు దేవేంద్రరెడ్డి.
తరచూ తనకు ఫోన్ చేసి పలుకరించే మనుమరాలు ఫోన్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చిన తాత శివారెడ్డి.. దేవేంద్రరెడ్డిని నిలదీశాడు. దాంతో అసలు విషయం బయటపెట్టాడు దేవేంద్ర. కూతురి ప్రవర్తనతో కుటుంబ పరువు పోవడంతో తానే ఆమెను హత్యచేసినట్టు చెప్పాడు. శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రసన్న తల, మొండెం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story