Mon Dec 23 2024 12:57:40 GMT+0000 (Coordinated Universal Time)
వేరే కులం వ్యక్తిని పెళ్లాడిన యువతి.. కొడవలితో నరికి చంపిన మేనమామ
బాధిత యువతి బజ్ నగర్ గ్రామంలోని తన మేనమామ ఇంట్లో నివాసం ఉండేది. అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో ఆమెకు..
వేరే కులం వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక పోయిన మేనమామ.. ఆమెను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి.. కొడవలితో గొంతుకోసి హత్యచేశాడు. ఈ పరువు హత్య ఉత్తరప్రదేశ్ లో శనివారం (మే 6) జరిగింది. పిసావాన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బజ్ నగర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల యువతికి గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో సంబంధం ఉందని, ఆమె గతేడాది నవంబర్ అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుందని సీతాపూర్ అడిషనల్ ఎస్పీ ఎన్పీ సింగ్ తెలిపారు. ఇది రూప్ చంద్రకు రెండో వివాహం.
బాధిత యువతి బజ్ నగర్ గ్రామంలోని తన మేనమామ ఇంట్లో నివాసం ఉండేది. అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో ఆమెకు సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం మేనమామ శ్యాముకి తెలిసింది. మౌర్యది వేరే కులం. పైగా ఒకసారి పెళ్లి కావడంతో.. యువతిని మందలించి ఆమె తండ్రి పుతాన్ సింగ్ తోమర్ వద్దకు పంపించేశాడు. ఆమె ఘజియాబాద్ లో ఉంటుందని తెలుసుకున్న మౌర్య అక్కడికి వెళ్లి.. ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఇంటి నుండి వెళ్లిపోయి గతేడాది నవంబర్ లో వివాహం చేసుకున్నారు. ఇటీవల మౌర్య, ఆ యువతి తిరిగి బజ్ నగర్ గ్రామానికి వచ్చి కాపురం పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న మేనమామ శ్యాము సింగ్.. శనివారం వారింటికి వెళ్లి యువతిని బయటికి ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతుకోసి హతమార్చాడు. యువతి అక్కడికక్కడే మరణించింది. హత్యానంతరం శ్యాము సింగ్ కొడవలి తో పిసావన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని ఏఎస్పీ ఎన్పీ సింగ్ తెలిపారు. అప్పటికే వివాహమై ఉన్న వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story