Mon Dec 23 2024 07:02:19 GMT+0000 (Coordinated Universal Time)
భార్య శవాన్ని తీసుకుని వస్తున్న భర్త.. ఇంతలో
వావిలాల రజని అనే మహిళతో శరణ్యకు గొడవైంది. శరణ్య.. అకారణంగా నన్ను ఎందుకు తిడుతున్నావ్ అంటూ రజని ఇంటికెళ్లి ప్రశ్నించింది
చిన్నపాటి గొడవలు.. క్షణికావేషాలు.. ఓ జంట ప్రాణం తీయగా.. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలు పోడానికి కారణమైంది. స్థానికంగా ఉంటున్న మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా భర్త రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రేఖేందర్ మల్లికార్జున్ (31) రేఖేందర్ శరణ్య(28) దంపతులు. మల్లికార్జున్ లారీ డ్రైవర్. శనివారం ఉదయం లారీ నడిపేందుకు వెళ్లాడు. ఇంటి సమీపంలోని వావిలాల రజని అనే మహిళతో శరణ్యకు గొడవైంది. శరణ్య.. అకారణంగా నన్ను ఎందుకు తిడుతున్నావ్ అంటూ రజని ఇంటికెళ్లి ప్రశ్నించింది. కోపోద్రిక్తురాలైన రజని శరణ్యను కొట్టింది. స్థానికులు కలగజేసుకుని.. విడిపించారు. ఆ తర్వాత వరుసకు పిన్ని అయిన రేఖేందర్ రాణి ప్రోత్సాహంతో రజని.. శరణ్యపై లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న శరణ్యను మరోసారి తిట్టింది. ఈ ఘటనతో శరణ్య తీవ్ర మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన శరణ్య మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హూటాహుటిన లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటలకు చనిపోయింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో శరణ్య మృతదేహంతో తిరిగి ఎల్లారం బయలుదేరారు. ఆ వెనుకాలే మల్లికార్జున్ బైక్‌పై వస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లక్షెట్టిపేటకు చేరుకోగానే.. మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లికార్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లికార్జున్ మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. చనిపోయే ముందు మల్లికార్జున్ ఇచ్చిన ఫిర్యాదుతో వావిలాల రజనితో పాటు రేఖేందర్ రాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం భార్యభర్తలిద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రుల మృతితో ఓంకార్ (6), ఇవాంక(4) అనాథలయ్యారు.
Next Story