Mon Dec 23 2024 09:36:55 GMT+0000 (Coordinated Universal Time)
కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్
కోర్టులోకి ఆమె రాగానే తనవద్దనున్న యాసిడ్ బాటిల్ తీసి.. ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ ముఖంపై పడటంతో..
తనను కాదని ప్రియుడితో వెళ్లిపోయిన భార్యపై పగ పెంచుకున్న భర్త.. కోర్టు ఆవరణలోనే ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అయిన శివకుమార్, బాధిత మహిళ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెళ్లయ్యాక భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో కలిసి ఉండాలని నిర్ణయించుకుని ప్రియుడితో పరారైంది. తనను, పిల్లల్ని వదిలేసి వెళ్లిన భార్యపై శివకుమార్ పగ పెంచుకున్నాడు.
అయితే సదరు మహిళ 2016లో ఓ చోరీ కేసులో అరెస్టై.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం (మార్చి 23) ఆమె కోర్టుకు హాజరైంది. ఆమె కోర్టుకు వస్తుందని ముందే తెలుసుకున్న శివకుమార్ పథకం ప్రకారం తన వెంట యాసిడ్ బాటిల్ తెచ్చుకున్నాడు. కోర్టులోకి ఆమె రాగానే తనవద్దనున్న యాసిడ్ బాటిల్ తీసి.. ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ ముఖంపై పడటంతో.. ఆమె నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్నవారు మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో మహిళకు 80 శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం పరారయ్యేందుకు యత్నించిన నిందితుడు శివకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story