Fri Nov 22 2024 15:04:28 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ పెళ్లి.. బలానికి మందులని చెప్పి హెచ్ఐవీ ఇంజెక్షన్ వేయించాడు.. కారణం అదేనా?
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో ఎలా బతకాలని..
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం బాగానే సాగింది. ఇద్దరూ ఆనందంగా గడిపారు. ఇంతలో వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చురేపింది. అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెను వదిలించుకునేందుకు ప్లాన్ చేశాడు. బలానికి మందులు ఇప్పిస్తానని చెప్పి.. HIV ఇంజెక్షన్ వేయించాడు ఆ సైకో భర్త. ఈ ఘటన గుంటూరుజిల్లా తాడేపల్లిలో వెలుగుచూసింది. మరో యువతి మోజులో పడి తనకు అన్యాయం చేశాడంటూ ఆ గృహిణి రోడ్డెక్కింది.
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో ఎలా బతకాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో భర్త చరణ్ ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్ల వరకూ తన భర్త బాగానే ఉన్నాడని, తనను బాగానే చూసుకున్నాడని పోలీసులకు తెలిపింది. మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడిన క్రమంలో.. తనను దూరం పెట్టాడని, శాశ్వతంగా దూరంగా ఉంచేందుకు పథకం పన్నాడని వాపోయింది.
పిల్లలు పుట్టాలన్నా, బలంగా ఉండాలన్నా తనుకు ఇంజెక్షన్ ఇవ్వాలని తన భర్త తనను మభ్యపెట్టాడని, ఈ క్రమంలో భర్త మాటలను నమ్మి ఇంజెక్షన్ వేయించుకున్నానని చెప్పింది. పిల్లల కోసం టెస్టింగ్ చేయించుకోగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై భర్త చరణ్ ను నిలదీయగా.. ప్రెగ్నెన్సీ సమయంలో అంగన్ వాడీలో ఆమెకు వ్యాక్సిన్ వేశారని, దాని వల్లే హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని అతడు బుకాయించాడు. తనకు పలు దఫాలుగా హెచ్ఐవీ ఇంజెక్షన్లు వేయించాడని తన భర్తపై బాధితురాలు ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story