Tue Dec 24 2024 01:04:42 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను చంపేసి బ్యారెల్ పార్సిల్ చేసిన భర్త
తనకు ఊరిలో అర్జెంటు పని ఉండటంతో ఇల్లు ఖాళీ చేస్తున్నానంటూ యజమానికి చెప్పి, కొన్ని సామాన్లను టాటా ఏస్ వాహనంలోకి..
తాను ఇంట్లో లేని సమయంలో భార్య పక్కింటి వాళ్లతో ఎక్కువగా మాట్లాడుతుందని తెలుసుకున్న భర్త ఆమెతో గొడవపడి, గొంతునులిమి హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కారవార సమీపంలోని హళియాళ పట్టణంలో జరిగింది. తుకారామ్ మడివాళ అలియాస్ తుకారామ్ కొన్ని సంవత్సరాల క్రితం శాంతకుమారి (38)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుండి ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. హళియాళ పట్టణంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తుకారామ్ వ్యాపారస్తుడు కావడంతో ఎక్కువగా ఇంటిపట్టున ఉండేవాడు కాదు.
ఈ క్రమంలో భార్య శాంతకుమారికి పక్కింటివారితో పరిచయం ఏర్పడింది. రోజులో ఎక్కువ సమయం వాళ్లతోనే మాట్లాడుతుందని, గంటలుగంటలు వాళ్లింట్లోనే ఉంటోందని తుకారామ్ కు తెలిసింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరడంతో భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఖాళీ వాటర్ బ్యారెల్ లో ప్యాక్ చేసి, ఒకరోజంతా ఇంట్లోనే ఉంచుకున్నాడు. మరునాడు శవం ఉన్న బ్యారెల్ ను తీసుకుని టాటా ఏస్ వాహనంలో తీసుకెళ్లి కారవార సమీపంలోని దట్టమైన అడవుల్లో పడేసి ఇంటికి వచ్చాడు.
తనకు ఊరిలో అర్జెంటు పని ఉండటంతో ఇల్లు ఖాళీ చేస్తున్నానంటూ యజమానికి చెప్పి, కొన్ని సామాన్లను టాటా ఏస్ వాహనంలోకి ఎక్కించాడు. యజమానికి అనుమానం వచ్చి మళ్లీ ఇల్లు ఖాళీ చేయడానికి కారణమేంటని అడిగాడు. తాను గోవా వెళ్తున్నానని అందుకే ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. అప్పటికే చాలారోజులుగా తుకారామ్, తన భార్య గొడవలు పడుతున్నారని యజమానికి తెలిసింది. పోలీసులకు సమాచారమిచ్చాడు. వాళ్లు వచ్చేసరికే తుకారామ్ సామాన్లు తీసుకుని వెళ్లిపోయాడు. అతనికోసం పహారా కాసిన పోలీసులు.. ఊరిచివరన పట్టుకున్నారు. విచారణ చేయగా శాంతకుమారి హత్య విషయం తెలిసింది. తుకారామ్ తో పాటు అతనికి సహకరించిన రిజ్వాన్ సమీర్ అనే నిందితుడినీ కారవార పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story