Mon Dec 23 2024 12:43:35 GMT+0000 (Coordinated Universal Time)
కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి చంపిన భర్త..
వివాహ సమయంలో దివ్య తల్లిదండ్రులు కట్నకానుకలు భారీగానే అందించారు. వివాహం అనంతరం దంపతులు ఉప్పల్ లోని...
కన్నబిడ్డల కళ్లముందే భార్య గొంతుకోసి హతమార్చాడో భర్త. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగింది. 10 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న ఆ దుర్మార్గుడు శుక్రవారం రాత్రి ఇంటికొచ్చాడు. అర్థరాత్రి సమాయంలో ఇంటికొచ్చి.. భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది దివ్యభారతి (33)కి హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన పుస్తకాల దీపక్ (40)తో 12 ఏళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు.
వివాహ సమయంలో దివ్య తల్లిదండ్రులు కట్నకానుకలు భారీగానే అందించారు. వివాహం అనంతరం దంపతులు ఉప్పల్ లోని కురుమనగర్ లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్య ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా.. దీపక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత దీపక్ కు అదనపు కట్నంపై ఆశ కలిగింది. అప్పట్నుంచి దివ్యభారతిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు.
దీపక్ వేధింపులు భరించలేక దివ్య కొన్నినెలల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అయినా దీపక్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో 10 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న అతను.. శుక్రవారం అర్థరాత్రి ఇంటికొచ్చి దివ్యభారతిపై దాడి చేశాడు. పిల్లలు చూస్తుండగానే కత్తితో ఆమె గొంతును కోసేశాడు. పిల్లల అరుపులు, ఏడుపులకు చుట్టుపక్కలవారు పరుగెత్తుకుని వచ్చేసరికి దివ్య చనిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని దీపక్ ను అరెస్ట్ చేశారు.
దీపక్పై దివ్య భారతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీపక్కి గతంలో మరో అమ్మాయితో పెళ్లి జరగ్గా.. ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడన్నారు. ఆ తర్వాత తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దివ్యభారతి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story