Mon Dec 23 2024 04:54:12 GMT+0000 (Coordinated Universal Time)
పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
మీర్ చౌక్ లో ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మసూద్ అలీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు.
హైదరాబాద్ లోని పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. శనివారం అర్థరాత్రి, మండి మీర్ ఆలం సమీపంలోని మగర్ కి బౌలి వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మీర్చౌక్ పోలీసులకు సమాచారం అందింది. మసూద్ అలీ ఖాన్ (న్యాయవాది), ముర్తుజా అలీ ఖాన్, హష్మతునిసా బేగం, మహ్మద్ ఖలీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ అకా అర్ఫాత్, మహ్మద్ అనీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ, ఇబ్రహీం అలీ ఖాన్, సుల్తానా, ఇతర కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. రెండు గ్రూపులు పరస్పరం ఘర్షణకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ గొడవ సమయంలో న్యాయవాది మసూద్ అలీ ఖాన్ తన రైఫిల్ నుండి ప్రత్యర్థి వర్గంపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
మీర్ చౌక్ లో ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మసూద్ అలీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. అర్ఫాత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది.ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా.. ఎలా కొంటారని గొడవకు దిగారు. ఇదే విషయంపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. గత శనివారం మరోసారి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అర్ఫాత్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే అడ్వకేట్ అర్ఫాత్ తో గొడవ పడ్డాడు. వారిని భయపెట్టేందుకు తన దగ్గరున్న తుపాకీతో మసూద్ అలీ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కోఆర్డినేషన్ గజరావు భూపాల్, ఇతర పోలీసు అధికారులతో కలిసి రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Next Story