Mon Dec 23 2024 10:14:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమన్నాడు.. భర్తను వదిలేసి రమ్మన్నాడు.. సీన్ కట్ చేస్తే..
ఐదేళ్ల క్రితం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో మహారాష్ట్ర జల్ గావ్ కు చెందిన సైఫ్ (28)తో పరిచయం ఏర్పడింది.
ప్రేమ పేరుతో యువకులు యువతుల్ని, యువతులు యువకులని తమ అవసరాలకు వాడుకుని, అవసరం తీరాక మొహం చాటేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని బోరబండలో వెలుగుచూసింది. ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో.. పెళ్లైన యువతి తన భర్తకు విడాకులిచ్చి, దేశాలు దాటొచ్చింది. ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్న ఆ ఘనుడు.. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం బాధిత యువతి చెవిన పడటంతో.. ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (27) టెలీకాలర్ గా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో మహారాష్ట్ర జల్ గావ్ కు చెందిన సైఫ్ (28)తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అదికాస్తా ప్రేమగా మారింది. పెళ్లికూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోనే ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. కానీ.. యువతి తరపువారు పెళ్లికి నిరాకరించారు. 2020లో ఆమెకు మరొకరితో వివాహం జరిపించి, దుబాయ్ కి పంపించేశారు. పెళ్లైనా.. ఆమె తన ప్రియుడితో కాంటాక్ట్ లోనే ఉంది. రోజూ మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేసుకోవడం కంటిన్యూ చేశారు.
నిన్ను వదిలి ఉండలేకపోతున్నా.. నీ భర్తకు విడాకులిచ్చేసి వస్తే.. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని యువతిని నమ్మించాడు. సైఫ్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన యువతి.. తన భర్తకు విడాకులిచ్చి తిరిగి నగరానికొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు. కొంతకాలం సహజీవనం చేశారు. పెళ్లి ఎప్పుడు చేసుకుందామని యువతి ప్రశ్నించినప్పుడల్లా మాట దాటవేసేవాడు. చివరికి ఓ రోజు బాధిత యువతిని వదిలేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడ మరో అమ్మాయితో ఈ నెల 22న పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత యువతి అతని గ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్ సహా అతని కుటుంబసభ్యులు సైతం ఆమెను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన యువతి.. సైఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story