Mon Dec 23 2024 12:10:32 GMT+0000 (Coordinated Universal Time)
నాగర్ కర్నూల్ ఆస్పత్రిలో దారుణం.. నాళాలో శిశువు మృతదేహం
సోమవారం డెలివరీ కోసం 18 మంది గర్భిణీలు ప్రసూతి వార్డులో చేరారు. వారిలో 8 మందికి సిజేరియన్ చేయగా..
నాగర్ కర్నూల్ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగుచూసింది. మానవత్వానికి, అమ్మతనానికి మాయని మచ్చలా ఉండిపోయే ఘటన ఇది. ఆస్పత్రిలోని బాత్రూమ్ లో నీళ్లు బయటకు వెళ్లడంలేదని నాళా మూత తెరిచి చూసిన సిబ్బంది పసికందు మృతదేహం కనిపించింది. దాంతో అవాక్కయిన సిబ్బంది.. వెంటనే ఆస్పత్రి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పసికందు మృతదేహాన్ని వెలికితీసి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డెలివరీ వార్డులో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. ఆసుపత్రిలోని రికార్డుల ప్రకారం.. సోమవారం డెలివరీ కోసం 18 మంది గర్భిణీలు ప్రసూతి వార్డులో చేరారు. వారిలో 8 మందికి సిజేరియన్ చేయగా.. ముగ్గురికి నార్మల్ డెలివరీ అయింది. మిగతా గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే పలువురు గర్భిణీలు.. సమస్యల కోసం ఏర్పాటు చేసిన జనరల్ ఓపీ వార్డుకు వచ్చి వెళ్లారు. బాలింతల కోసం ఏర్పాటు చేసిన బాత్రూమ్ లో నాలా మూత తెరిచి, అందులో పసికందు మృతదేహాన్ని పడేసి మూతను తిరిగి గట్టిగా బిగించారు.
వారందరిలో పసికందుని ఎవరు నాళాలో పడేశారన్న విషయం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓపీ కి వచ్చిన వారిలో ఎవరైనా బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి, ఆపై నాళాలో పడేసి వెళ్లారా ? లేక పుట్టిన శిశువును వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నమా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. బాత్రూమ్ లో పసికందు మృతదేహం బయటపడడంతో ఆసుపత్రిలోని బాలింతలు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Next Story