Sat Jan 11 2025 14:44:15 GMT+0000 (Coordinated Universal Time)
ఘరానా మోసం.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్లు టోకరా
ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని..
సినిమాల్లో పెట్టుబడుల పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వారి బంధువులను మోసం చేసి.. రూ.6 కోట్లు దోచుకుందో ముఠా. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బోర్వెల్స్ రంగాలలో పెట్టుబడుల పేరుతో నిందితులు మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని, తద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుంచి దాదాపు రూ.6 కోట్ల వరకూ వసూలు చేశారు. డబ్బులు తీసుకుని చాలా కాలమైనా.. ఎలాంటి పెట్టుబడులు ఉన్నట్లు కనిపించకపోవడంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలి అని అడిగారు. నిందితులు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు, దాడికి పాల్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి, వారి అనుచరులతో బెదిరించినట్లు బాధితులు చెప్పారు. తమ దగ్గర డబ్బులు దండుకుని, మోసానికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్నిఅరెస్ట్ చేశారు.
Next Story