Mon Dec 23 2024 10:20:34 GMT+0000 (Coordinated Universal Time)
పీజీ డాక్టర్ ప్రీతి పరిస్థితి విషమం.. ప్రత్యేక బృందం పర్యవేక్షణ
హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తుండగా.. రెండుసార్లు ప్రీతి గుండె ఆగిపోవడంతో.. సీపీఆర్ చేసినట్లు
వరంగల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పీజీ డాక్టర్ ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రీతి పరిస్థితి గురించి అప్పుడే ఏమీ చెప్పలేమన్నారు నిమ్స్ వైద్యులు. ప్రీతికి వైద్యం అందించేందుకు ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ పద్మజ నేతృత్వంలో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు కానీ.. చికిత్సకు ప్రీతి శరీరం స్పందించడం లేదని స్పష్టం చేశారు. బీపీ, పల్స్ రేట్ నమోదు కావడంలేదని తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వేధింపులు తాళలేక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం (ఫిబ్రవరి 22) మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తుండగా.. రెండుసార్లు ప్రీతి గుండె ఆగిపోవడంతో.. సీపీఆర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. మత్తు ఇంజక్షన్ హై డోస్ లో తీసుకోవడంతో ప్రీతి శరీరంలో తీవ్రంగా డ్యామేజీ జరిగిందని, అంతర్గతంగా అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, మెదడుపైనా మత్తుమందు ప్రభావం ఎక్కువగా ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రీతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. వరంగల్ కేఎంసీ లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. ప్రీతిపై వేధింపులకు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులపై పలుమార్లు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ సాధారణమేనని డీఎంఈ రమేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Next Story