కడపలో కంత్రీలు.. రైల్వేలో ఉద్యోగాల పేరుతో టోకరా
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో దోచేశారు కంత్రీలు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన జనం పోలీసులను ఆశ్రయించారు.
కడప : ఎలాగైనా డబ్బు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. జనాన్ని మోసం చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటే, మరి కొందరు చీటీ మోసాలు, కొందరైతే జనం మధ్యలోనే ఉంటూ వారిని నమ్మబలికించి డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అన్నీ తెలిసినా కొన్ని సార్లు మోసపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉద్యోగం వస్తుందనే ఆశతో డబ్బులు ముట్టజెప్పేందుకు జనం వెనుకాడడం లేదు.
జనాల నాడిని పసిగట్టిన జోయల్, సదా, శాంతి అనే ముగ్గురు దుండగులు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పది మందికి కుచ్చుటోపీ పెట్టారు. కడప జిల్లాలోని జమ్మల మడుగులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుని ఆశ్రయించారు. జోయల్ అతని కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షలు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బులు తీసుకుని మూడు సంవత్సరాల నుంచి ఇంటిచుట్టూ తిప్పుకుంటున్నారని, ఉద్యోగం సంగతి చెప్పమంటే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని బాదితులు పోలీసులు ముందు తమ గోడు వినిపించారు.
నిందితులు ముగ్గురూ జమ్మలమడుగుకు చెందిన వారిగా గుర్తించారు. వీరితోపాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం ఇతర వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వమని బాధితులు నిలదీయడంతో చేసేదేమీ లేక నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులంతా కలిసి జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారితో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.