Mon Dec 23 2024 17:37:40 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న కశ్మీర్ యువతి
గచ్చిబౌలి నానక్ రామ్ గూడ లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి నివసిస్తోంది.
హైదరాబాద్ లో రూమ్ మేట్స్ ఎవరూ లేని సమయం చూసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ హైదరాబాద్ లోని అమెజాన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలి నానక్ రామ్ గూడ లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి నివసిస్తోంది. రూమ్ మేట్స్ లో ఒకరు ఢిల్లీకి వెళ్లగా మరొకరు ఆఫీస్ కు వెళ్లగా.. ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్న కృతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన స్నేహితుడికి తాను చనిపోతున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేసింది.
చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్కు 'నాకు బతకాలని లేదు' ఓ మెసేజ్ పంపింది. అది చూసి అప్రమత్తమయ్యాడు సచిన్. సచిన్ హుటాహుటిన ప్లాట్కు వచ్చాడు. అతను ప్లాట్ కు వచ్చి చూసే సరికి తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతను కృతి రూమ్ మేట్ కు ఫోన్ చేశాడు. ఆమె తాళం పంపించగా తలుపులు తెరచి చూసారు. అప్పటికే కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా కృతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం సంబా జిల్లాలోని మండి తలోరా ప్రాంతానికి చెందిన అమ్మాయి కృతి సంబ్యాల్. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమె మరణ వార్తను ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు.
Next Story