Mon Dec 23 2024 05:58:19 GMT+0000 (Coordinated Universal Time)
చికిత్స చేస్తుండగా వైద్యురాలిని చంపిన రోగి.. సమ్మెకు పిలుపునిచ్చిన భారత వైద్యమండలి
వందనాదాస్ పై దాడి చేసిన క్రమంలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబ..
కేరళలోని కొల్లాం జిల్లా తాలూకా ఆస్పత్రిలో బుధవారం (మే10) దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స చేస్తున్న 23 ఏళ్ల మహిళా డాక్టర్ ను ఓ రోగి పొడిచి చంపాడు. నిందితుడు ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. కొట్టక్కరలోని ఆస్పత్రిలో డాక్టర్ వందనాదాస్ హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తోంది. ఆస్పత్రిలో కాలికి గాయంతో ఉన్న ఓ వ్యక్తికి బుధవారం డ్రెస్సింగ్ చేస్తోంది. చికిత్స సమయంలో అతను హఠాత్తుగా ఆగ్రహానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ చేస్తున్న మహిళా డాక్టర్ పై కత్తెర, ఇతర ఆయుధాలతో దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో వందనాదాస్ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను మరో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. వందనాదాస్ పై దాడి చేసిన క్రమంలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులతో ఘర్షణ పడగా కాలికి గాయమైంది. అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ వందనాదాస్ పై జరిగిన దాడి పై భారత వైద్యమండలి ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటల వైద్యుల సమ్మెకు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
డాక్టర్ వందనాదాస్ హత్యపై కేరళ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రత్యేక సెషన్ ద్వారా ఈ కేసును అత్యవసరంగా విచారించిన కోర్టు.. ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఇలా ప్రవర్తిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. 24 గంటల వైద్యుల సమ్మెలో రోగులకు ఏం జరిగినా వైద్యులను నిందించలేమని అభిప్రాయపడింది.
Next Story