Mon Dec 23 2024 07:54:54 GMT+0000 (Coordinated Universal Time)
'అనంత' దారుణం: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. యువకుడి గొంతు కోసి హత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. యువకుడి గొంతు కోసి హత్య
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుని గొంతుకోసి చంపేశారు. గురువారం రాత్రి రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన కనగానపల్లిలో బిసి సామాజిక తరగతికి చెందిన చిట్రా నాగను, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు కురుబ చిట్రా మురళి (27) అదే గ్రామానికి చెందిన ఎం.వీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి 2021 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తరుపు వారి నుంచి ప్రాణభయం ఉండడంతో ఇద్దరూ రాప్తాడు మండల కేంద్రంలో అద్దె ఇల్లు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
కియా పరిశ్రమలో సాధారణ ఉద్యోగిగా మురళి పనిచేస్తుండగా.. కనగానపల్లి మండలం ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా వీణ విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ రాప్తాడులో ఉంటూ వారివారి ఉద్యోగాలకువెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి కియాకువె ళ్లేందుకు రాప్తాడు వై.జంక్షన్ వద్ద మురళి వేచి ఉండగా.. యువతి కుటుంబ సభ్యులు బలవంతంగా కారులో ఎక్కించారు. రాప్తాడు సమీపంలోని త్రిబుల్ ఆర్ రెస్టారెంట్ వద్దకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి నుంచి మురళి ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శుక్రవారం ఉదయం త్రిబుల్ ఆర్ రెస్టారెంట్ వద్ద యువకుని మృతదేహాన్ని గుర్తించి మురళి కుటుంసభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story