Mon Dec 23 2024 08:28:34 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీని బురిడి కొట్టించిన సైబర్ నేరస్తుడు.. 97 వేలు స్వాహా !
వివరాలను పంపిన వెంటనే ఆయన మొబైల్ కు ఒక ఓటీపీ వచ్చింది. వెంటనే హెచ్ డీఎఫ్ సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నా అంటూ..
కర్నూల్ : ఓ సైబర్ నేరస్తుడు కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ను బురిడీ కొట్టించాడు. ఎంపీ సంజీవ్ కుమార్ బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, పాన్ నంబరుతో అప్డేట్ చేసుకోవాలని రెండ్రోజుల క్రితం ఆయన మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అప్డేట్ చేసుకునేందుకు కింద ఒక లింక్ కూడా ఉండటంతో.. నిజమేననుకున్న ఎంపీ.. వెంటనే ఆ లింక్ ను ఓపెన్ చేసి, అందులో అడిగిన వివరాలను ఫిల్ చేసి పంపించారు.
వివరాలను పంపిన వెంటనే ఆయన మొబైల్ కు ఒక ఓటీపీ వచ్చింది. వెంటనే హెచ్ డీఎఫ్ సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అతను అడిగిన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లన్నింటినీ సంజీవ్ కుమార్ చెప్పారు. మీ బ్యాంకు ఖాతా అప్ డేట్ అవుతుందని చెప్పి ఆ వ్యక్తి కాల్ చేశాడు. కొద్దిసేపటికే సంజీవ్ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700, రూ.48,999 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
పెద్దమొత్తంలో నగదు బదిలీ అయినట్లు వచ్చిన మెసేజ్ లను చూసి సంజీవ్ షాకయ్యారు. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేయగా.. తాము ఎవరి ఖాతాలను అప్డేట్ చేయట్లేదని చెప్పడంతో.. తాను మోసపోయినట్లు గ్రహించారు. తనకు జరిగిన సైబర్ మోసంపై కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి మొత్తం రూ.97,699 కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ నేరస్తుడిని పట్టుకుని పనిలో పడ్డారు.
Next Story