Mon Dec 23 2024 20:08:39 GMT+0000 (Coordinated Universal Time)
11 ఏళ్లుగా భార్యను బంధించిన న్యాయవాది కుటుంబం.. ఆఖరికి కోర్టు ఉత్తర్వులతో..
సుప్రియ-మధుసూదన్ లు పెళ్లైన మూడేళ్ల వరకూ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. లేనిపోని ఆంక్షలు పెట్టి ఆ ఇల్లాలికి
భర్త శాడిజం, అత్తింటి ఆంక్షలతో 11 ఏళ్లకు పైగా గృహ నిర్బంధంలో ఉన్న ఓ మహిళ.. తాజాగా కోర్టు ఆదేశాలతో బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. 11 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత కూతురిని చూసిన ఆ తల్లి కన్నీటి భాష్పాలు అందరిచేత కంటతడి పెట్టించాయి. పేరుకి అడ్వకేట్ భార్యే అయినా.. పనిమనిషిగా కాలం వెళ్లదీసింది ఆ అభాగ్యురాలు. అత్తింటి వేధింపులతో చిక్కశల్యమైంది. వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లాకు చెందిన గోదావరి మధుసూదన్ అనే అడ్వకేట్.. తన భార్య సుప్రియను ఇంట్లో నిర్బంధించి బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తల్లిదండ్రులను కూడా కలవనివ్వకుండా చేశాడు ఆ శాడిస్ట్ భర్త. తల్లి, తమ్ముడి మాటల్ని విని.. తాళికట్టిన భార్య అని కూడా మరచిపోయి.. ఆమెపట్ల దారుణంగా ప్రవర్తించాడు. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను విజయనగరం టౌన్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తల్లి గోదావరి ఉమామహేశ్వరి, తమ్ముడు దుర్గాప్రసాద్ లతో కలిసి నివాసం ఉంటున్నాడు.
సుప్రియ-మధుసూదన్ లు పెళ్లైన మూడేళ్ల వరకూ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. లేనిపోని ఆంక్షలు పెట్టి ఆ ఇల్లాలికి నరకం చూపించడం ప్రారంభించారు. M.A లిటరేచర్ చదివిన సుప్రియను ఇంటికే పరమితం చేసి ఇష్టకష్టాలు పెట్టారు. ఫోన్ లాక్కుని ఎవరితోనూ మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారు. సుప్రియ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రాధేయపడ్డ ఫలితం ఉండేది కాదు. అలా ఇంట్లో మనుషులు తప్పా మరో లోకం తెలియకుండా పన్నెండు ఏళ్లు గడిచాయి. పనిమనిషి అవతారమెత్తి భరించరాని బాధలన్నీ పంటిబిగువున అదిమి పట్టింది. అత్త పెట్టే చాలీ చాలని భోజనంతో అర్థాకలితో అవస్థలు పడింది. కూతురిని చూడాలని తల్లిదండ్రులు వచ్చినా.. మాట్లాడనిచ్చేవాళ్లు కాదు మధుసూదన్, అతని తల్లి. వారిని దుర్భాషలాడి వెనక్కి పంపించేవారు.
సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు చివరికి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో వన్ టౌన్ పోలీసులు ఫిబ్రవరి 28న సుప్రియ ఆచూకీ కోసం గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళారు. మధుసూదన్, అతని తమ్ముడు దుర్గాప్రసాద్ లు లాయర్లు కావడంతో.. ఇంటిని తనిఖీచేసే అధికారం లేదని, కోర్టు ఆదేశాలుంటే చూపాలని వాగ్వాదానికి దిగారు. వారి ప్రవర్తనతో సుప్రియ తల్లిదండ్రులు కోర్టుకెళ్లి సెర్చ్ వారెంట్ ను తీసుకొచ్చారు. ఆ వారెంట్ తో మార్చి 1న మధుసూదన్ ఇంటికి మరోసారి వెళ్లగా.. పోలీసులను మధుసూదన్ అడ్డుకున్నాడు.
బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంటిని తనిఖీ చేయగా సాయి సుప్రియ బక్క చిక్కిన శరీరంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సుప్రియ ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. గోదావరి మధుసూదన్, దుర్గాప్రసాద్, ఉమామహేశ్వరి పై అక్రమ నిర్భంధం తో పాటు అదనపు కట్న వేధింపుల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లోనూ రాణిస్తున్న నేటికాలంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.
Next Story