ఆమె తల నరికి.. తీసుకెళ్లి పోలీసుల ముందు ఉంచాడు
ఆమె తల తీసుకెళ్లి పోలీసుల ముందు ఉంచాడు
తనతో పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు యువతి.. తల నరికి చంపేశాడు. అనంతరం తలను సంచిలో తీసుకెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. బంధువైన బసన్న కుమార్తె నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడిన భోజరాజ ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం భోజరాజకు మరో యువతితో వివాహమైంది. నిర్మల ఇటీవల స్వగ్రామానికి రాగా విషయం తెలిసిన భోజరాజ మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆమెను హత్య చేసే ఉద్దేశంతో వెంట కత్తి తీసుకెళ్లిన భోజరాజ కత్తితో ఆమె తల నరికి హత్య చేశారు. ఆపై మొండెం నుంచి తలను వేరుచేసి దానిని సంచిలో వేసుకున్నాడు. కుడ్లిగి తాలూకాలోని ఖానాహోసహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.