Thu Dec 19 2024 16:04:01 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలల పరిచయం.. బావ-మరదలు ఆత్మహత్య
పోలీసులు గది తలుపులను పగలగొట్టి చూడగా.. బాత్రూమ్ లోని కిటికీ ఊచలకు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. యువతి మెడలో..
వరుసకు వారిద్దరూ బావ-మరదలు. పరిచయమై కొద్దికాలమే అయినా.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తమ ప్రేమ విషయం చెప్తే ఒప్పుకోరనుకుని భావించి.. బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ (20) ఇంటర్ పూర్తి చేసి.. వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆమదాలవలస బెలమాం గ్రామానికి చెందిన అదపాక సంతోషికుమారి (18) ఇంటర్ పూర్తి చేసి శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
రెండు నెలల క్రితం దామోదర్ సోదరికి పాతకుంకాం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆ వివాహానికి ఆమదాలవలస బెలమాం గ్రామానికి చెందిన అదపాక సంతోషికుమారి (18)తో దామోదర్ కు పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచీ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ.. ఛాటింగ్ లు చేసుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించి.. విడిపోలేనంత బలంగా నాటుకుంది. సోమవారం ఇద్దరూ కలిసి విశాఖ నగరానికి వెళ్లారు. ఆర్టీసీ కాంప్లెక్సుకు సమీపంలోని గొల్లెలపాలెంలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ గది నుంచి బయటకు రాకపోవడంతో..అనుమానంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు గది తలుపులను పగలగొట్టి చూడగా.. బాత్రూమ్ లోని కిటికీ ఊచలకు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. యువతి మెడలో పసుపు తాడు ఉండటంతో.. ఇద్దరూ పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. కాగా.. వారి ఆత్మహత్యలకు కారణాలు తెలియరాలేదు. బిడ్డల మరణవార్త విన్న ఇద్దరి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ వ్యవహారం గురించి తమకి చెప్పి ఉంటే పెళ్లి చేసేవారమంటున్నారు. ఈశ్వరరావు-శాంతమ్మ దంపతులకు పెళ్లైన 12 ఏళ్లకు పుట్టింది సంతోషికుమారి. ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుశోకం మిగిలింది.
Next Story