Mon Dec 23 2024 11:28:39 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నంలో మహిళా వైద్యురాలి దారుణ హత్య
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆసుపత్రిలోని కింద అంతస్తులో డాక్టర్ ఉమామహేశ్వరరావు..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలో జవ్వారుపేటలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జవ్వారుపేట కూడలిలో డాక్టర్ ఉమామహేశ్వరరావు - రాధ నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సొంతంగా చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్వహిస్తూ.. అందులోనే వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు డాక్టర్ రాధపై దాడి చేసి.. ఆమెను అతి కిరాతకంగా హతమార్చారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆసుపత్రిలోని కింద అంతస్తులో డాక్టర్ ఉమామహేశ్వరరావు అవుట్ పేషంట్ లను చూస్తున్నారు. భార్య రాధ ఎంతసేపటికీ కిందికి రాకపోవడంతో ఫోన్ చేశారు. అయినా రెస్పాన్డ్ అవకపోవడంతో.. మొదటి అంతస్తుకెళ్లి చూడగా.. తల, గొంతు భాగంలో తీవ్రగాయాలతో రాధ రక్తపు మడుగులో పడి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
దుండగులు తమ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఇల్లంతా కారంపొడి చల్లి .. రాధ శరీరంపై ఉన్న నగలను దొంగిలించినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఘటనా ప్రాంతాన్ని డీఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు, పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story