Mon Dec 23 2024 02:16:52 GMT+0000 (Coordinated Universal Time)
డబ్బు కోసం గూగుల్ మేనేజర్ ను కిడ్నాప్ చేసి.. బలవంతంగా..
సుజాత ద్వారా ఆమె కుటుంబీకులు గణేశ్ ను తమ ఇంటికి రప్పించుకున్నారు. అనంతరం అతడిని కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి..
ఈజీ మనీ కోసం.. చేయరాని పనులన్నీ చేస్తున్నారు. కిడ్నాప్ లు , మర్డర్లే కాకుండా బలవంతపు పెళ్లిళ్లూ జరుగుతున్నాయి. డబ్బు కోసం మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం దారుణానికి తెగబడింది. గూగుల్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేసేశారు. ఈ ఘటనపై బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణేశ్ శంకర్ అనే వ్యక్తి బెంగళూరులోని గూగుల్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఐఐఎం షిల్లాంగ్ లో ఎంబీఏ చదువుతోన్న సుజాత అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె స్వస్థలం భోపాల్.
సుజాత ద్వారా ఆమె కుటుంబీకులు గణేశ్ ను తమ ఇంటికి రప్పించుకున్నారు. అనంతరం అతడిని కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అతడికి సుజాతతో బలవంతంగా పెళ్లి జరిపించి.. ఫొటోలు, వీడియోలు తీశారు. పెళ్లి అనంతరం తమకు రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెళ్లి ఫోటోలు, వీడియోలను బయటపెట్టి.. అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లు కేసులు పెడతామని బెదిరించారు. అనంతరం గణేశ్ ను డబ్బు తీసుకురావాలని విడిచిపెట్టగా.. అతను స్థానిక కమలా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సుజాతతోపాటు, ఆమె తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story