Tue Dec 24 2024 03:03:30 GMT+0000 (Coordinated Universal Time)
స్నేహితుడని పార్ట్నర్ షిప్ ఇస్తే.. అమ్మాయి మోజులో పడి..
2019 ఆగస్టు 28న సతీష్ బాబు స్నేహితుడి వద్దకు బీర్లు తీసుకుని వెళ్లాడు. సరదాగా ఇద్దరూ మద్యం సేవించారు. సతీష్ మత్తులో..
స్నేహితుడు కదా.. మోసం చేయడు అన్న నమ్మకంతో వ్యాపారంలో పార్ట్ నర్ షిప్ ఇస్తే.. ఓ అమ్మాయి మోజులో పడి దారుణంగా చంపేశాడు. నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా మార్టూర్ కు చెందిన మైల సతీష్ బాబు(31) అమీర్ పేటలోని ఐటీ స్లాట్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తూ కేపీహెచ్ బీ కాలనీ ఏడోఫేజ్ ఎంఐజీలో స్లాట్ సొల్యూషన్స్ పేరుతో శిక్షణ, మై సాఫ్ట్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బ్యాంకు కాలనీకి చెందిన ఎం హేమంత్ అలియాస్ కన్నా(35) సికింద్రాబాద్ లో ఉంటున్నాడు.
తనకు ఉద్యోగం కావాలని సతీష్ బాబును 2017లో అడగడంతో.. తన కంపెనీలోనే 2018లో పార్ట్ నర్ షిప్ ఇచ్చాడు. వారి కంపెనీలోనే శిక్షణ పొందిన ఓ యువతి అక్కడే ఉద్యోగంలో చేరింది. అప్పటికే పెళ్లైన హేమంత్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కంపెనీ పక్కనే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సతీష్.. ఆమె తిరిగి హాస్టల్ కు పంపాలని 2019 ఆగస్టు 27న హెచ్చరించాడు. 28న మళ్లీ వస్తానని ఆ లోపు ఆమె ఇక్కడ ఉండకూడదని చెప్పాడు. యువతి మోజులో ఉన్న హేమంత్.. సతీష్ పై పగ పెంచుకున్నాడు.
ఎలాగైనా సతీష్ ను చంపాలని ప్లాన్ చేసి.. ముందుగానే పెద్దసైజు పాలిథిన్ బ్యాగులు తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. 2019 ఆగస్టు 28న సతీష్ బాబు స్నేహితుడి వద్దకు బీర్లు తీసుకుని వెళ్లాడు. సరదాగా ఇద్దరూ మద్యం సేవించారు. సతీష్ మత్తులో ఉండగానే హేమంత్ సుత్తితో సతీష్ తలపై గట్టిగా కొట్టి హత్యచేశాడు. మరుసటిరోజున రంపంతో శరీరాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే శరీరం ఉబ్బడంతో తెగలేదు. ఏమీ తెలియనట్టుగా మృతుడి స్నేహితులు, భార్యతో కలిసి వెతికినట్టు నటించాడు. హేమంత్ పై అనుమానం రావడంతో ఆగస్టు 30న హేమంత్ ఫ్లాట్ కు వెళ్లి చూడగా.. హేమంత్ మృతదేహం కనిపించింది. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సెప్టెంబర్ 5న తారానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించిన హేమంత్ కు కూకట్ పల్లి 3వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కల్యాణచక్రవర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించారు. సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం చేసినందుకు మరో రూ.5వేలు జరిమానా, మూడేళ్లు జైలుశిక్ష విధించారు.
Next Story