Tue Mar 25 2025 04:23:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి దుర్మరణం
డబ్బులు ఇవ్వకపోతే ఫ్లై ఓవర్ పై నుంచి దూకుతానని, లేదంటే ఉరేసుకుంటానని పలుమార్లు కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు.

ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో వెలుగుచూసింది. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కోమటిబస్తీకి చెందిన కొర్రా అశోక్ (35)గా గుర్తించారు. బాలానగర్ సీఐ కె.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుంటాడు. కొన్నేళ్లుగా సరిగ్గా పనిచేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. భార్య, సంజీవరెడ్డినగర్ లో ఉండే బంధువుల నుంచి డబ్బులు తీసుకుని ప్రతిరోజూ మద్యం సేవించేవాడు.
డబ్బులు ఇవ్వకపోతే ఫ్లై ఓవర్ పై నుంచి దూకుతానని, లేదంటే ఉరేసుకుంటానని పలుమార్లు కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు. ఆరు నెలల క్రితం ఇలాగే చనిపోతున్నానంటూ తమ్ముడు అభిలాష్ కు ఫోన్ చేయగా.. అతని వచ్చి రక్షించాడు. సోమవారం మరోసారి తప్పతాగి ఎవరికీ చెప్పకుండా బాలానగర్ ఫ్లై ఓవర్ ఎక్కి దూకేశాడు. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇది గమనించిన స్థానికులు అశోక్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీకి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
Next Story