Mon Dec 23 2024 07:07:47 GMT+0000 (Coordinated Universal Time)
ఒకరితో ప్రేమ.. మరొకరితో సహజీవనం.. ప్రియుడి ఆత్మహత్య
మే17వ తేదీన హన్మకొండలోని జులైవాడకు చెందిన గిన్న విష్ణువర్థన్ అనే వ్యక్తి ప్రేయసి ఉండే ప్రాంతానికి..
ఈ రోజుల్లో ప్రేమ అనే పదానికి అర్థమే మారిపోయింది. స్వలాభం కోసం, స్వార్థం కోసం ప్రేమించేవారే ఎక్కువగా ఉన్నారు. ఎంత గాఢ ప్రేమికులైనా.. ఏదొక సమస్యతో విడిపోతున్నారు. పెళ్లికి ముందైనా.. తర్వాతైనా.. కలిసి ఉండలేకపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా భీమదేరిపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో సెల్ఫీ వీడియో తీసుకుని.. యువకుడు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. తనను మోసం చేసిన ప్రియురాలికి తాను చనిపోయాక.. తన డెడ్ బాడీని చూపించాలంటూ అతను సెల్ఫీవీడియోలో చెప్పిన తీరు అందరినీ కలచివేస్తోంది.
మృతుడు సాయి చందన్.. సెల్ఫీ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మే17వ తేదీన హన్మకొండలోని జులైవాడకు చెందిన గిన్న విష్ణువర్థన్ అనే వ్యక్తి ప్రేయసి ఉండే ప్రాంతానికి తనను పిలిపించి దారుణంగా కొట్టి, హింసించి, బెదిరించారని వాపోయాడు. హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా.. విష్ణువర్థన్ ని, ఆ అమ్మాయిని పిలిపించి పోలీసులు ఎంక్వైరీ కూడా చేయలేదన్నాడు. ఆ అమ్మాయి, విష్ణు కలిసి తనను చాలా టార్చర్ చేశారని, తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని, తననే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి.. చివరి నిమిషంలో దారుణంగా మోసం చేశారంటూ కంటతడి పెట్టుకున్నాడు.
తన జీవితంతో ఆడుకున్న ఆ ఇద్దరిని వదిలిపెట్టొద్దని వీడియోలో తెలిపాడు. నాలుగు నెలలుగా తన మనోభావాలతో ఆడుకుని చివరికిలా చేశారని వాపోయాడు. మే 21న ఆ అమ్మాయి పుట్టినరోజు కావడంతో.. అర్థరాత్రి 12 గంటల తర్వాత అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపి.. తాను చనిపోతున్నట్లు సాయిచందన్ వీడియోలో చెప్పాడు. ఆ అమ్మాయి పుట్టినరోజున తన మరణాన్ని గుర్తుచేసుకోవాలని, అందుకే ఇప్పటివరకూ చనిపోకుండా ఉన్నానని తెలిపాడు. తనకు చావు తప్ప మరో మార్గం లేదని, స్నేహితులు, అమ్మ-నాన్న, చెల్లి, బావ అందరూ క్షమించాలని వీడియోలో చెప్పిన తీరు కలచివేస్తోంది. చివరి కోరికగా.. తాను చనిపోయాక తన డెడ్ బాడీని ఆమెకు చూపించాలన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు.
Next Story