Sat Nov 23 2024 00:24:52 GMT+0000 (Coordinated Universal Time)
పోస్టుమార్టం వద్దంటూ భుజంపై మృతదేహంతో పరుగులు.. అసలేం జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన..
ఓ వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ పక్క వైద్యులు, పోలీసులు- బంధువులు మాట్లాడుతుండగానే.. మరోవైపు ఓ వ్యక్తి ఆ మృతదేహాన్ని తీసుకుని పరుగుతీశాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి గురువారం(జనవరి 12) రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున భర్త లేవకపోయేసరికి.. ఏమైందా అని చూసిన భార్య చంద్రవ్వ.. అతను మరణించాడని తెలిసి షాకయ్యింది.
ఇరుగు పొరుగు వారికి.. బంధువులకు విషయం తెలియడంతో.. అందరూ అక్కడికి చేరుకున్నారు. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. కానీ.. పోస్టుమార్టం చేసేందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదని, గుండెపోటుతో చనిపోయాడని చెబుతుండగానే.. మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story