Wed Jan 15 2025 08:21:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు పిల్లల తల్లి.. ఇద్దరు మొగుళ్లతో...?
ఇద్దరిని పెళ్లి చేసుకుని మహిళ కన్పించకుండా పోయింది. తమ భార్య కన్పించడం లేదంటూ భర్తలిద్దరూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు
ఈ జీవితానికి నువ్వే నాకు భర్త.. ఈ జన్మకు నువ్వే నా అర్థాంగివి.. అంటూ పెళ్లినాడు చేసే ప్రమాణాలను పట్టించుకోకుండా తమ సంతోషాల కోసం వేరేదారి చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకునే.. ఈ తరహా గొడవలను ఎక్కడా చూసి ఉండరు. చూసినా.. చాలా అరుదు. పెళ్లై 22 ఏళ్లు కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లైన మహిళ.. ఇప్పుడు వాళ్లను కాదని తనకు నచ్చిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాంతో మొదటి భర్త వచ్చి ఆమె నా భార్య అని చెప్పగా.. నేను పెళ్లి చేసుకున్నా.. ఆమె నాకూ భార్యేనన్నాడు రెండో భర్త. ఇలా భార్య కోసం ఇద్దరు భర్తలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కానీ.. పోలీసులు కూడా వారి సమస్యకు ఎలా పరిష్కారం చూపాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ విచిత్ర సంఘటన హైదరాబాద్ - వరంగల్ లో వెలుగులోకొచ్చింది.
వరంగల్ జిల్లాలోని...
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ టీచర్స్ కాలనీ -2 లో లంకా శశికాంత్ (42), భార్య దుర్గా సుశీల అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యదేవి (35)తో కాపురం ఉంటున్నాడు. వీరిద్దరికీ వారి పెద్దలు 1999 ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేశారు. శశికాంత్ వృత్తిరీత్యా ఓ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు (16), కుమార్తె (13) లు ఉన్నారు. 22 ఏళ్ల కాపురంలో వారి మధ్య విడిపోయేంత కలతలేవీ లేవు. అంతా బాగానే ఉంది. కానీ.. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీ పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి సుశీల మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. పైగా ఇంట్లో ఉండాల్సిన 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు కూడా కనిపించలేదు. దీంతో భార్య నగలు, నగదుతో పరారయిందని గ్రహించిన శశికాంత్ ఆమెకోసం వెతకడం మొదలుపెట్టాడు.
తన భర్త కాదంటూ...
స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా ఆచూకీ తెలియలేదు. ఆఖరికి తన భార్య ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్ తో వెళ్లిపోయిందని తెలిసింది శశికాంత్ కి. దాంతో సుబేదారి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని సుశీల, ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్ లను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ముగ్గురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించగా.. సుశీల ప్లేటు ఫిరాయించింది. శశికాంత్ తన మొదటి భర్త కాదని, తన అక్కచనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానని, ఆ పిల్లలు తన పిల్లలు కాదని ట్విస్ట్ ఇచ్చింది. దాంతో ఖంగుతిన్న శశికాంత్ మళ్లీ ఫిర్యాదు చేశాడు. తన పిల్లలకు తల్లిప్రేమ కావాలి.. నాభార్యను నాకు అప్పగించండి అని పోలీసుస్టేషన్ లో విజ్ఞప్తి చేశాడు.
కన్పించకుండా పోవడంతో....
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సుశీల రెండవ భర్త ఇంటి నుంచి కూడా కనిపించకుండా పోయింది. దాంతో సత్యవరప్రసాద్ 3 నెలల గర్భిణి అయిన తన భార్య కనిపించడం లేదంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల ను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
Next Story