Mon Dec 23 2024 09:14:55 GMT+0000 (Coordinated Universal Time)
రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టారా ? ఈ కేటుగాళ్లతో జాగ్రత్త !
రెండోపెళ్లి చేసుకోవాలనుకున్న మహిళలే వారికి టార్గెట్. అలాంటి వారిని ఏరి మరీ మోసం చేస్తున్నారు. విశాఖలోని మధురవాడకు..
ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల కోసం పేరయ్యలను సంప్రదించాల్సిన పనిలేదు. కులానికొక మాట్రిమోనియల్ సైట్లు కుప్పలుతెప్పలుగా పుడుతున్నాయి. ఎలాంటి పెళ్లికొడుకు/పెళ్లికూతురు కావాలన్నా మాట్రిమోనీని సంప్రదించి.. ప్రొఫైల్ అందులో అప్ లోడ్ చేస్తే చాలు. సంబంధాలు వాటంతట అవే వస్తాయి. కానీ.. ఇదే మాట్రిమోనీ అడ్డాగా.. కొందరు మాయగాళ్లు, కిలేడీలు అమ్మాయిలు, అబ్బాయిలను ఫేక్ ప్రొఫైల్స్ తో మోసం చేసి, అందినంత వరకూ డబ్బు గుంజి, ఆపై ముఖం చాటేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వైజాగ్ లో వెలుగుచూసింది.
రెండోపెళ్లి చేసుకోవాలనుకున్న మహిళలే వారికి టార్గెట్. అలాంటి వారిని ఏరి మరీ మోసం చేస్తున్నారు. విశాఖలోని మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి పెళ్లై రెండేళ్ల పాప ఉంది. భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. రెండోపెళ్లి కోసం తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ డాట్ కామ్ లో అప్ లోడ్ చేశారు. ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు నెలరోజుల క్రితం ఫోన్ చేశారు. తాను దుబాయ్ లో ఉంటానని, మొదటి భార్యతో తనకు విడాకులు అయ్యాయని పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్ నాకు నచ్చింది. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ నమ్మించాడు.
కొద్దిరోజుల పాటు ఆమెతో చాటింగ్ చేసి దగ్గరయ్యాడు. వారంరోజుల్లో ఇండియాకు వచ్చేస్తున్నానని, టికెట్లు కూడా బుక్ చేసుకుంటానన్నాడు. ప్లాన్ లో భాగంగా తాను ఇండియాకు వచ్చే ముందు కొన్ని బహుమతులు పంపిస్తున్నానంటూ ప్యాక్ చేసి ఉన్న బాక్సులను ఫోటోలు తీసి వాట్సాప్ చేశాడు. ఇక కథ షురూ చేశాడు. మూడ్రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నట్లు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ పేరుతో విదేశాల నుంచి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెప్పారు. నిజమేననుకున్న యువతి.. వారు చెప్పిన అకౌంట్ కు డబ్బులు పంపింది.
ఛాన్స్ దొరికిందనుకున్న కేటుగాళ్లు.. మళ్లీ ఫోన్ చేసి , గిఫ్ట్ బాక్సులను స్కాన్ చేస్తే లోపల విలువైన బంగారం, డైమండ్స్ ఉన్నట్లు తెలిసిందని, అవి ఇవ్వాలంటే వాటిలో కొంతపర్సంటేజీ డ్యూటీ చెల్లించాలని నమ్మబలికారు. దాంతో ఆ యువతి మరికొంత డబ్బును జమచేసింది. కానీ ఇంటికి ఎలాంటి గిఫ్టులు రాలేదు. దాంతో అసలు వ్యక్తికి ఫోన్ చేయగా.. తాను ఇండియా వస్తున్నానని, తనతోపాటు గిఫ్టులను తీసుకొస్తానన్నాడు. మర్నాడు ఫోన్ చేసి.. ఇండియన్ కరెన్సీ లేకుండా భారత్ కు వచ్చానని, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉన్నానని, తనకు కొంత డబ్బు పంపాలని కోరాడు. ఇలా పలు దఫాలుగా యువతి నుంచి మొత్తం రూ.18 లక్షలు లాగేశాడు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్. ఎన్ని మెసేజ్ లు చేసినా రిప్లై లేకపోవడంతో ఆ యువతి తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
Next Story