Mon Dec 23 2024 19:03:12 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో మెడికో ఆత్మహత్య.. అక్రమ సంబంధాలు, వరకట్న వేధింపులు?
తోటి రూమ్ మేట్స్ హాస్టల్ సిబ్బందికి సమాచారమివ్వగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి..
నెల్లూరు జిల్లాలో ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని నెల్లూరు నగర పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉంటూ హౌస్ సర్జన్ గా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం కళాశాల హాస్టల్ గదిలో చైతన్య విగతజీవురాలై కనిపించింది. తోటి రూమ్ మేట్స్ హాస్టల్ సిబ్బందికి సమాచారమివ్వగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కాగా.. మూడున్నర నెలల క్రితమే చైతన్యకు వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చైతన్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. చైతన్యకు ఆమె భర్తతో ఏమైనా గొడవలు జరిగాయా ? లేక కాలేజీలో వేధింపులు ఉన్నాయా ? ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు చైతన్య మేనమామ శ్రీరామ్.. ఆమె ఆత్మహత్యకు కారణం భర్త వేధింపులేనని చెబుతున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో తమకు చైతన్య చనిపోయినట్లు సమాచారం అందిందన్నారు. చైతన్య చిన్నప్పుడే తండ్రి ఆర్మీలో మరణించగా.. అమ్మమ్మ, తల్లి, తన పెంపకంలో పెరిగిందని, ఎంతో కష్టపడి చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చి 8న చైతన్యకు పెళ్లిచేశామన్నారు. అడిగినంత కట్నకానుకలు ఇచ్చామని, పెళ్లి తర్వాత భర్త నిజస్వరూపం బయటపడిందన్నారు.
పెళ్లైన 10 రోజులకే అతని బండారం బయటపడటంతో చైతన్య తీవ్రమనస్తాపానికి గురైందన్నారు. చైతన్య తన భర్త ఫోన్ చూసినపుడు అతనికి అక్రమ సంబంధాలున్న విషయాలు బయటపడ్డాయని, ఆ విషయమై ప్రశ్నించగా.. వరకట్న వేధింపులు మొదలైనట్లు శ్రీరామ్ తెలిపారు. ఇలాంటి వ్యక్తికిచ్చి పెళ్లిచేశారు.. నా జీవితమే నాశనం అయిందంటూ చైతన్య పలుమార్లు తన తల్లికి ఫోన్ చేసి మొరపెట్టుకునేదని, గతరాత్రి కూడా తల్లితో మాట్లాడిందన్నారు. చైతన్య ఆత్మహత్యకు ముందు తన భర్తతో మాట్లాడినట్లుగా తెలిసిందన్నారు.
Next Story