Mon Dec 23 2024 10:56:16 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం సొంతజిల్లాలో దారుణం.. ట్విట్టర్లో లోకేష్ విమర్శలు
మసీదుకు సమీపంలోని ఓ డెకరేషన్ షాపులో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు.. బాలికకు మాయమాటలు చెప్పి ..
కడప : ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో బాలికపై జరిగిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగుచూసింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న మైనర్ బాలికపై 10 మంది మృగాళ్లు.. పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. దాంతో విషయం బయటికి తెలిసింది. అయినా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాధిత బాలిక స్థానిక మసీదు వద్ద ఆశ్రయం పొందుతూ.. భిక్షాటన చేస్తోంది. తండ్రి మరో ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. మసీదుకు సమీపంలోని ఓ డెకరేషన్ షాపులో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు.. బాలికకు మాయమాటలు చెప్పి .. ఇటీవలే కూల్చిన మార్కెట్ యార్డు వద్దకు ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మే 4న బాలికను గమనించిన స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్ బాలికతో ఏకాంతంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 10 మంది తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది.
కానీ.. వన్ టౌన్ పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ అయిన బాలికను ప్రస్తుతం మైలవరంలోని ప్రైవేటు స్వచ్చంద సంస్థకు పంపినట్లు సమాచారం. ఈ ఘటనపై ఏపీ టిడిపి నేత నారా లోకేష్ మండిపడ్డారు. ఇంత దారుణం జరుగుతుంటే.. ఆ గన్.. జగన్ ఎక్కడున్నాడంటూ ఫైర్ అయ్యారు.
"గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే..ఏదా గన్? ఎక్కడా జగన్? అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. పదిహేనేళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన నిందితులని కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణా?" అని మండిపడ్డారు.
Next Story