Mon Dec 23 2024 02:44:37 GMT+0000 (Coordinated Universal Time)
58 ఏళ్ల మహిళపై టీనేజర్ హత్యాచారం
జనవరి 30న ఇంట్లో తన భర్త, కుమారుడు లేని సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంతలో నిద్రిస్తున్న బాధిత మహిళకు..
58 ఏళ్ల మహిళపై టీనేజర్ హత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో వెలుగు చూసింది. జనవరి 30న ఖైలాష్ పురి గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం ఆ టీనేజర్ తమ సెల్ఫోన్ దొంగిలించాడని మృతురాలి కుటుంబం ఆరోపించడంతో ఆమెపై హత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనంలో బాధితురాలు తన కుటుంబంతో కలిసి నివసించేది.
జనవరి 30న ఇంట్లో తన భర్త, కుమారుడు లేని సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంతలో నిద్రిస్తున్న బాధిత మహిళకు మెలకువ వచ్చి అరిచేందుకు ప్రయత్నించడంతో ఆమె నోట్లో గుడ్డలు, ప్లాస్టిక్ బ్యాగ్ కుక్కాడు. ఆ తరువాత.. బాధితురాలి మొహంపైన ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి భవంతిలో నిర్మాణం పనులు జరుగుతున్న చోటికి లాక్కెళ్లాడు. ఆపై ఆమెను తలుపుకి కట్టేసి, పదే పదే కొట్టాడు. ఈ క్రమంలో ఆమె ఊపిరాడక మూర్ఛపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై కొడవలితో దాడిచేసి చంపేశాడు. మహిళ ఇంట్లో ఉన్న రూ.1000 నగదు, బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
ఫిబ్రవరి 1న కొందరు స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మహిళ కుటుంబం, యువకుడి మధ్య నెలకొన్న వివాదం బయటపడింది. నిందితుడిని వెతికి పట్టుకోగా నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేశాడని మహిళ కుటుంబం ఆరోపించడంతో గ్రామంలో తన పరువు పోయినట్టుగా భావించాడని టీనేజర్ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు మీడియాకు తెలిపారు.
Next Story