Mon Dec 23 2024 15:46:00 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్లు.. వేర్వేరు కులాలు.. పెళ్లిచేయలేమనడంతో ప్రేమికులు ఆత్మహత్య
సుల్తానాబాద్ మండలం కనుకులలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఆ నోట ఈ నోటా చేరి..
పెద్దపల్లి : టీనేజ్ లో ప్రేమ సహజం. కొందరికి అది ఆకర్షణగానే మిగిలిపోగా.. మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు. ప్రేమించిన వ్యక్తితోనే జీవితాంతం ఉండాలనుకుంటారు. అందుకు వయసుతో పాటు.. కులంగోడలు అడ్డుతగిలితే.. వేరే గత్యంతరం లేక అర్థంతరంగా జీవితాలను ముగించుకుంటారు. ఈ టీనేజ్ ప్రేమికులు కూడా అదే చేశారు. వేర్వేరు కులాలు.. పైగా మైనర్లు.. మీకు పెళ్లిచేయడం కుదరదని చెప్పారు పెద్దలు. అంతే.. మనస్తాపానికి గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కనుకులలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఆ నోటీ ఈ నోటా చేరి ఊరంతా తెలిసింది. ఇరు కుటుంబ సభ్యులు ప్రేమికులను మందలించి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనర్లు, పైగా వేర్వేరు కులాలు కావడంతో పెళ్లి చేయలేమని తెగేసి చెప్పారు పెద్దలు. పోలీసులు, కుటుంబసభ్యులు ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. మనస్తాపం చెందిన శివ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అతడిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
శివ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందగా.. అది తెలిసిన సుస్మిత మంగళవారం తెల్లవారుజామున గ్రామంలో ఉన్న వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి ఆత్మహత్యలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ,సుస్మితల ఫొటోలతో గ్రామస్తులు వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది.
Next Story