Mon Dec 23 2024 10:51:21 GMT+0000 (Coordinated Universal Time)
కడపలో విషాదం.. మిస్సైన యువతి మృతదేహం లభ్యం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనూష ఆచూకీ కోసం గాలించారు. నాలుగు రోజుల తర్వాత ..
వైఎస్సార్ జిల్లాలో నాలుగురోజుల క్రితం కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి కథ విషాదాంతమైంది. అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బి.కొండూరు మండలం మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతుల రెండో కుమార్తె అనూష(19) బద్వేలులోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అక్టోబర్ 20వ తేదీన కాలేజీకి వెళ్లిన అనూష రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో అనూష తల్లిదండ్రులు బద్వేలు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనూష ఆచూకీ కోసం గాలించారు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో సిద్ధవటం సమీపంలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద అనూష మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. అనూషను అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు దానిని కొట్టిపడేశారు. ఆమె అదృశ్యమైన రోజు రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ వెల్లడించారు. తమ కుమార్తె మరణంపై తల్లిదండ్రులు సైతం అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి బద్వేలు పీఎస్ కు వెళ్లగా.. అది తమ పరిధి కాదని వెనక్కిపంపేశారని వాపోయారు. బి.కోడూరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెబితే బద్వేలులో అదృశ్యమైంది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారని తెలిపారు.
చేసేది లేక అదే రోజు రాత్రి 11 గంటలకు బాధిత కుటుంబ సభ్యులు మైదుకూరు డీఎస్పీని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పాపిరెడ్డిపల్లెకు చెందిన గురుమహేశ్వర్రెడ్డి అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పామన్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినపుడే పోలీసులు స్పందించి ఉంటే.. తమ కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story