Fri Dec 20 2024 04:55:33 GMT+0000 (Coordinated Universal Time)
లోన్స్ ఇస్తూ వేధిస్తున్న చైనా యాప్ నిర్వాహకుల అరెస్ట్.. వెనకుండి నడిపిస్తున్నదెవరంటే
లోన్స్ ఇస్తూ వేధిస్తున్న చైనా యాప్ నిర్వాహకుల అరెస్ట్..
దేశంలో ఎంతో మందిని లోన్ యాప్స్ బలి తీసుకుంటున్న సంగతి తెలిసిందే..! అలాంటి ఓ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు.. ఎన్నో కోట్ల రుణాలను ఇస్తూ మోసం చేయడమే కాకుండా.. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న ఆన్ లైన్ లోన్ యాప్ రాకెట్‌ను ఛేదించారు. ఈ స్కాం వెనుక సూత్రధారితో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ రాకెట్ కోసం పనిచేస్తున్న 149 మంది సిబ్బందికి నోటీసులు అందాయి. 153 హార్డ్ డిస్క్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 141 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, 10 ఆండ్రాయిడ్ ఫోన్లు, నాలుగు డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు లోన్ అప్లికేషన్ యాప్‌ను నడుపుతున్న ఇద్దరు చైనా జాతీయులతో టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అనిల్ కుమార్, అలోక్ శర్మ (24), అవ్నీష్ (22), కన్నన్ (35)లుగా గుర్తించారు. జూలై 14న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో హిమాన్షు గోయెల్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఫేస్బుక్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, రూ. 50,000 అవాంతరం లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చిన ఒక ప్రకటన కనిపించిందని గోయెల్ ఆరోపించారు. "ఆన్ స్ట్రీమ్" అనే లోన్ యాప్‌ని డౌన్లోడ్ చేసిన తర్వాత.. యాప్ కాంటాక్ట్‌లు, గ్యాలరీని యాక్సెస్ చేయడానికి అనుమతిని కోరింది. దీని తరువాత, అతనికి రూ. 6870 రుణం మంజూరు చేయబడింది. ఆపై నిందితులు అతని కాంటాక్ట్స్, ఫోటోలను ఉపయోగించి అతన్ని వేధించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు లక్ష చెల్లించానని, అయితే ఇంకా ఎక్కువ చెల్లించాలని వేధిస్తున్నారని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసుల విచారణలో నిందితుల ఆచూకీ లభించగా.. ద్వారకా సెక్టార్ -7లోని ఓ భవనంలోని మూడు అంతస్తుల్లో ఫ్లై హై గ్లోబల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ పేరుతో గత రెండేళ్లుగా భారీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రైడ్ నిర్వహించి, ద్వారకా సెక్టార్-3లో నివాసం ఉంటున్న యజమాని అనిల్ కుమార్ 149 మంది టెలీకాలర్లు, ముగ్గురు టీమ్ లీడర్లను నియమించుకుని మొత్తం సిండికేట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు సిల్పానీ ఇంటర్నేషనల్ పేరుతో 300 సిమ్ కార్డులను కొనుగోలు చేసి, అందులో 100 సిమ్ కార్డ్‌లను ఉపయోగించి అవమానకరమైన వాట్సాప్ సందేశాలను పంపి బాధితులను బెదిరింపులకు గురిచేశారని పోలీసులు తెలిపారు.
నిందితులు చైనా వ్యక్తులతో కలిసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ఇప్పటి వరకు వారు ఆల్బర్ట్ మరియు ట్రే అనే ఇద్దరు చైనీయులకు 10 కోట్ల రూపాయలు చెల్లించగా.. మార్చి, 2021 నుండి కమీషన్‌గా మూడు కోట్ల రూపాయలు సంపాదించారు. వారు డింగ్ టాక్ యాప్‌లో మాట్లాడేవారు. ఫోటోలను మార్ఫింగ్ చేయడం ద్వారా ప్రజలను వేధించేది. టెలికాలర్లు బాధితులను బెదిరించి, వారి దగ్గర నుండి డబ్బులను బలవంతంగా లాక్కునేవారు. బాధితులు, వారి బంధువుల ఫోటోగ్రాఫ్‌లు, ఆధార్, పాన్ కార్డ్‌లలోని ఛాయాచిత్రాలను కూడా మార్ఫింగ్ చేసి అవమానకరమైన వ్యాఖ్యలతో మెసేజ్ లను పంపేవారు. ఈ రాకెట్లో ప్రధాన సూత్రధారి అనిల్‌ను ఆల్బర్ట్, ట్రే అనే ఇద్దరు చైనా వ్యక్తులు సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. డింగ్ టాక్ యాప్‌లో వారితో మాట్లాడేవాడు. వారి సహాయంతో నిందితులు దాదాపు 150 మందికి ఉపాధి కల్పించి ఈ దోపిడీ రాకెట్‌ను ప్రారంభించారు.
News Summary - Multi-crore Chinese loan app fraud extortion racket busted in Delhi
Next Story