Sun Dec 29 2024 02:07:48 GMT+0000 (Coordinated Universal Time)
మరో పరువు హత్య.. కూతురిపై అనుమానంతో?
వరంగల్ లో మరో పరువు హత్య వెలుగుచూసింది. కూతురు పరాయి కులస్తుడిని ప్రేమించిందని తెలుసుకున్న తల్లి ఆమెను హతమార్చింది.
మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి అనేది ఒక నానుడి. అది మంచి కోసం చెప్పారు కానీ.. చాలా మంది దానిని చెడుదారిలో మలచుకుంటున్నారు. కాలం మారినా.. కట్టుబాట్లు మారినా.. ఇంకా కులం పేరుతో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కూతురు కులం తక్కువ వాడితో మాట్లాడితే చాలు.. కన్నెర్రజేసి చూసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. అప్పట్లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య సంచలనం సృష్టించింది. తాజాగా వరంగల్ లో మరో పరువు హత్య వెలుగుచూసింది. కూతురు పరాయి కులస్తుడిని ప్రేమించిందని తెలుసుకున్న తల్లి ఆమెను హతమార్చింది.
చిన్న కుమార్తె....
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పెళ్లి చేసి కట్నకానుకలు ఇచ్చి అత్తవారింటికి సాగనంపింది సమ్మక్క. ఆ తర్వాత సమ్మక్క భర్త కాలం చేయడంతో కూరగాయలు అమ్ముతూ చిన్నకూతురు అంజలి(17)తో కలిసి జీవితాన్ని నెట్టుకొస్తోంది. అంజలి (17) స్థానికంగా ఉన్న హైస్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ తో అంజలి ప్రేమలో పడింది.
నిద్రలో ఉండగా...
ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం సమ్మక్క చెవిన పడింది. కూతురు కులాంతర వివాహం చేసుకుంటే తమ కుటుంబ పరువు పోతుందని భావించి నవంబర్ 19వ తేదీ అర్థరాత్రి సమ్మక్క తన తల్లి నాము యాకమ్మతో కలిసి అంజలి నిద్రలో ఉన్న సమయంలో దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారు. మర్నాడు ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో భాగంగా సమ్మక్క, యాకమ్మలను ప్రశ్నించగా అసలు విషయాన్ని చెప్పి, అంజలిని తామే హతమార్చినట్లు అంగీకరించారు.
Next Story