Mon Mar 31 2025 10:05:05 GMT+0000 (Coordinated Universal Time)
పాస్టర్ ప్రవీణ్ ది హత్యా? రోడ్డు ప్రమాదమా? ఆ పన్నెండు నిమిషాలు కీలకం
పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిలో మిస్టరీ వీడలేదు. రోడ్డు ప్రమాదం అని చెబుతున్నప్పటికీ క్రైస్తవ సోదరులు మాత్రం దానిని హత్యగానే చెబుతున్నారు

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిలో మిస్టరీ వీడలేదు. పాస్టర్ ప్రవీణ్ మృతి రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రోడ్డు ప్రమాదం అని చెబుతున్నప్పటికీ క్రైస్తవ సోదరులు మాత్రం దానిని హత్యగానే చెబుతున్నారు. పన్నెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ద్విచక్ర వాహనంపై రావడం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ సభలకు అధికసంఖ్యలో క్రైస్తవ సోదరులు హాజరవుతారు. ఆయన ప్రసంగాలు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అయితే బైక్ పై వస్తుండగా రాజమండ్రిలోని ఒక సభకు రాత్రి పూట వెళుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారని, పోలీసులు దీనిని అనుమానస్పద మృతిగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎలాంటి క్లూ లభించక...
అయితే పాస్టర్ ప్రవీణ్ చివరి సారిగా ఫోన్ మాట్లాడిన వారితోనూ సంప్రదించారు. అయితే ఎలాంటి అనుమానాలు రాలేదు. అదే సమయంలో కొవ్వూరు వంతెన వద్ద, దాని తర్వాత పెట్రోలు బంకు సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో ఆందోళన చేస్తున్న క్రైస్తవ సోదరులకు నచ్చ జెప్పి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హైదరాబాద్ కు పోలీసులు పంపారు. అయితే ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తో పాటు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా ఆందోళనకు దిగి ఇది ముమ్మాటికీ హత్యేనంటూ వారు ఆరోపించడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించిది. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించింది.
ప్రభుత్వం సీరియస్...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి విచారణను నిష్పక్షపాతంగా జరిపి హత్య అని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి దర్యాప్తునకు కొవ్వూరు డీఎస్పీని అధికారిగా నియమించారు. ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలతో ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ జరుపుుతున్నారు. చివరిసారిగా పాస్టర్ ప్రవీణ్ చివరి సారిగా రాజమండ్రికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు గుర్తించి అతనిని విచారించారు. పన్నెండు నిమిషాల్లోనే ఏదో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ జరిగింది...
అయితే అది సమయంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ ఈ నెల 24వ తేదీ రాత్రి 11.31 నిమిషాలకు కొవ్వూరు టోల్ ప్లాజాను దాటడాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గమనించారు. 11.42 నిమిషాలకు టోల్ గేట్ తర్వాత ఉన్న పెట్రోల్ బంకును బైకు దాటింది. అయితే బైకు వెంట ఆ సమయంలో ఐదు వాహనాలు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు సీసీటీవీలో గుర్తిచంారు. అయితే అవి ప్రవీణ్ వాహనాన్ని దాటుకుని వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గుతేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. మరి అసలు వాస్తవం తెలియాల్సి ఉంది.
Next Story