Mon Dec 23 2024 01:13:01 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్.. శోభనం గదిలో వరుడు మృతి
సెప్టెంబర్ 12, సోమవారం పెద్దల సమక్షంలో తులసి ప్రసాద్-యువతికి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం జరిగే కార్యం..
పెళ్లై ఒక్కరోజైనా పూర్తిగా గడవలేదు. నవ దంపతుల కాళ్లపారాణి ఆరలేదు. అంతలోనే నవవరుడు మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని మదనపల్లెలో వరుడు శోభనం గదిలో మృతి చెందడంతో.. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మదనపల్లె చంద్రాకాలనీకి చెందిన యువతి.. పాకా మండలం పత్తిపాటివారిపల్లికి చెందిన తులసి ప్రసాద్ ప్రేమించుకున్నారు. ఇరువురు ఈ విషయాన్ని తమ ఇళ్లల్లో చెప్పగా.. పెద్దలు వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు.
సెప్టెంబర్ 12, సోమవారం పెద్దల సమక్షంలో తులసి ప్రసాద్-యువతికి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం జరిగే కార్యం నిమిత్తం తులసి ప్రసాద్ తన భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. కొత్తపెండ్లి కొడుకు - పెళ్లి కూతురితో రకరకాల ఆటలు ఆడించారు. ఇద్దరినీ శోభనం గదిలోకి పంపించారు. గదిలోకి వెళ్లిన తులసిప్రసాద్ ఉన్నట్లుండి అచేతనంగా పడిపోయాడు. భార్య ఎంత లేపినా.. తులసి ప్రసాద్ లో కదలిక లేదు. కంగారుపడిన ఆమె.. వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. హుటాహుటిని అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తులసి ప్రసాద్ కు గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
తులసి ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పచ్చని పందిట్లో నవ్వుతూ తిరగాల్సిన కొడుకు.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. తులసి ప్రసాద్ ఆకస్మిక మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
Next Story