Wed Jan 15 2025 13:37:15 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణానదిలో శవమై కనిపించిన కొత్తపెళ్లికొడుకు.. హత్యా? ఆత్మహత్యా ?
గుంటూరు బస్టాండ్ నుంచి తెనాలి బస్సెక్కి అత్తారింటికి వెళ్లాల్సి ఉండగా.. టాయిలెట్ కు వెళ్లొస్తానని కిరణ్ కుమార్ బయటికెళ్లాడు.
తాడేపల్లి : గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన కొత్త పెళ్లి కొడుకు కృష్ణానదిలో శవమై కనిపించాడు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ కు.. తెనాలి జిల్లా చెంచుపేటకు చెందిన శ్రీలేఖతో ఈనెల 13న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఏప్రిల్ 16వ తేదీన కిరణ్ కుమార్ మూడు నిద్రల కోసం బంధువులతో కలిసి అత్తారింటికి బయల్దేరాడు.
గుంటూరు బస్టాండ్ నుంచి తెనాలి బస్సెక్కి అత్తారింటికి వెళ్లాల్సి ఉండగా.. టాయిలెట్ కు వెళ్లొస్తానని కిరణ్ కుమార్ బయటికెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన కిరణ్ కుమార్ అతని కోసం గుంటూరు బస్టాండ్ చుట్టుపక్కలంతా వెతకసాగారు. ఎక్కడా కనిపించలేదు. మూడ్రోజులుగా కిరణ్ ఆచూకీ కోసం వెతుకుతున్నా అతని జాడ తెలియలేదు. ఆఖరికి తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ 24వ గేట్ వద్ద కిరణ్ మృతదేహం లభ్యమైంది. అతని జేబులో ఉన్న మొబైల్ ఆధారంగా కిరణ్ కుమార్ ను గుర్తించి, కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కిరణ్ కుమార్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిసిందని, ప్రస్తుతానికి ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.
Next Story