Thu Dec 19 2024 10:53:36 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం.. ఏపీలో 9 మంది ఆత్మహత్య
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేష్(17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు.
ప్రతి ఏటా 10, ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు మనస్తాపంతో.. ఇక జీవితమే అనవసరం అని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని ఎంత అవగాహన కల్పించినా ఫలితం ఉండట్లేదు. ఇటీవలే ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండ్రోజులుగా రాష్ట్రంలో పరీక్షలు ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో 9 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఇద్దరు బలవన్మరణానికి యత్నించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన విద్యార్థిని అనూష(17) ఇంటర్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపం చెంది గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే అనూష కర్ణాటకలో ఉంటోన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. ఫలితాలు వచ్చాక తల్లి ఫోన్ చేసి ఒక సబ్జెక్ట్ పోయినట్లు తెలిపింది. రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి ఈసారి ఉత్తీర్ణత సాధిస్తానని తల్లితో చెప్పింది. అదే జిల్లాలో బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు(17) ఇంటర్ ఎంపీసీ సెకండియర్ లో మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాడు. దాంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అనకాపల్లికి చెందిన కరుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల చిన్నకుమారుడు కరుబోతు తులసీ కిరణ్(17) ఇంటర్ ఫస్టియర్‌లో మార్కులు తక్కువ వచ్చాయన్న బాధతో గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్(17).. ఇంటర్ పరీక్షలో తప్పడంతో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని గోప్యంగా దహన సంస్కారాలకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని పోస్టుమార్టమ్ కు పంపారు. విశాఖ నగరంలోని పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న బోనెల జగదీష్(18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒక సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేష్(17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. బుధవారం ఫలితాలు విడుదల కావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్ జాన్ సైదా(16)కు గణితంలో ఒక్కొక్కటి, ఫిజిక్స్‌లో ఆరు, కెమిస్ట్రీలో ఏడు మార్కులు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిల్లకల్లుకు చెందిన మరో విద్యార్థి రమణ రాఘవ సీనియర్ ఇంటర్లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ కలిపి మూడు సబ్జెక్టులు తప్పడంతో.. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధు మిత్రులు ఆస్పత్రికి తరలించారు. అదే జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యానని గురువారం చీమల మందు తాగడంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story