Mon Dec 23 2024 05:52:06 GMT+0000 (Coordinated Universal Time)
కుమార్తె, భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే పోయాయి
రైలు ఎక్కబోయిన కూతురు పడిపోబోతుంటే.. ఆమెను రక్షించబోయి
రైలు ఎక్కబోయిన కూతురు పడిపోబోతుంటే.. ఆమెను రక్షించబోయి ఓ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే భర్త, కూతురు మృతి చెందటంతో భార్య కుప్పకూలిపోయింది. ఈ ఘోరం నిజామాబాద్లో చోటు చేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన రామచంద్రరావు, సునీత దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రామచంద్రరావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. మియాపూర్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె జస్మిత ఇంటర్, చిన్న కుమార్తె జనని(15) పదో తరగతి చదువుతోంది.
అక్టోబర్ 19న బాసరలో సరస్వతీ దేవికి పూజ చేసేందుకు హైదరాబాద్ నుంచి ట్రైన్లో బయల్దేరారు. రామచంద్రరావు, సునీత ఒక బోగీలో.. ఇద్దరు కుమార్తెలు మరో బోగీలో ట్రైన్ ఎక్కారు. నిజామాబాద్లో అందరూ ఒకే బోగీలోకి మారేందుకు ట్రైన్ దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తె జస్మితను రామచంద్రరావు ఎక్కించాడు. చిన్న కుమార్తె జననిని ఆ బోగీలోకి ఎక్కిస్తుండగా ట్రైన్ కదిలింది. దీంతో జనని అదుపుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించిన రామచంద్రరావు కూడా ట్రైన్, పట్టాల మధ్య ఇరుక్కుపోయాడు. కూతురు జనని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలైన రామచంద్రరావును స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త, చిన్న కుమార్తె మృతి చెందడంతో భార్య సునీత కుప్పకూలిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు రైల్వే పోలీసులు.
Next Story