Fri Nov 22 2024 16:56:08 GMT+0000 (Coordinated Universal Time)
షాకైన నిజామాబాద్ జిల్లా.. ఆరు హత్యలా!!
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్‌ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేశాడు. ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి... అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకు వెళ్లాడు. బాసర వద్ద గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలోకి తోసేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి, ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకువెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు.
నిందితుడు ప్రశాంత్, హతుడు ప్రసాద్ ల స్వస్థలం మాక్లూర్. ప్రసాద్ చాలాకాలం క్రితమే మాచారెడ్డిలో స్థిరపడ్డాడు. ప్రశాంత్, ప్రసాద్ ల మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. ప్రసాద్ ఇంటిపై కన్నేసిన ప్రశాంత్, ఇంటిపై లోన్ ఇప్పిస్తానంటూ ఆ ఇంటిని తన పేరిట రాయించుకున్నాడు. లోన్ ఇప్పించకపోగా, ఆ ఇల్లు తనదేనని ప్రశాంత్ మోసం చేయడంతో ప్రసాద్ తన ఇంటి కోసం గొడవ పడుతూ వచ్చాడు. దాంతో ప్రసాద్ ను శాశ్వతంగా తొలగించుకోవాలని ప్లాన్ చేసిన ప్రశాంత్ మాయమాటలు చెప్పి ప్రసాద్ ను కామారెడ్డి వద్ద అటవీప్రాంతంలో మట్టుపెట్టాడు. ఆ తర్వాత అతని భార్యను తీసుకువెళ్లి బాసర వద్ద గోదావరిలోకి తోసేశాడు. వారి ఇద్దరు పిల్లలను చంపి, కాలువలోకి పడేశాడు. ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను కూడా ఇదే తరహాలో చంపేశాడు. సదాశివనగర్ లో ఒక మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడం మొదలు పెట్టారు. బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు, మాచారెడ్డిలో మరొక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ హత్యలన్నింటినీ 15 రోజుల వ్యవధిలోనే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యాకాండలో ప్రశాంత్ కు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల గురించి తెలిసి ప్రజలంతా నివ్వెరపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ నరరూప రాక్షసుడిని వదిలిపెట్టకూడదని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story