Mon Dec 23 2024 14:13:11 GMT+0000 (Coordinated Universal Time)
వికారాబాద్ లో నర్సింగ్ విద్యార్థిని హత్య
శనివారం (జూన్ 10) రాత్రి ఇంటి నుండి బయటికెళ్లిన శిరీష (19) అనే నర్సింగ్ స్టూడెంట్ తిరిగి ఇంటికి రాకపోవడంతో..
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరిగి మండలం కాళ్లపూర్ గ్రామంలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. శనివారం (జూన్ 10) రాత్రి ఇంటి నుండి బయటికెళ్లిన శిరీష (19) అనే నర్సింగ్ స్టూడెంట్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా జాడ తెలియలేదు. ఆదివారం (జూన్ 11) ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్సై విఠల్ రెడ్డి ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా.. శిరీష కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించారు. యువతి కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. యువతిని హత్యచేసి నీటికుంటలో పడేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శిరీష ఇంటర్మీడియట్ పూర్తిచేసి వికారాబాద్ లోని ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల ఆమె తల్లికి గుండెపోటు రావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్యానికి గురవ్వడంతో శిరీష రెండునెలలుగా కాలేజీకి వెళ్లడంలేదని పోలీసులు తెలిపారు.
గతరాత్రి శిరీష, ఆమె తండ్రి మాత్రమే ఇంట్లో ఉండగా.. శిరీష తలుపుకు బయటినుండి తాళం పెట్టి వెళ్లిందని చెబుతున్నారు. కళ్లను స్క్రూడైవర్ తో పొడిచి అంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె తండ్రి, తమ్ముడిని ప్రశ్నించిన పోలీసులు.. శిరీష అక్క భర్తను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులే శిరీషను హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Next Story