Mon Dec 23 2024 06:27:03 GMT+0000 (Coordinated Universal Time)
విడాకులకు కోటి ఇవ్వాలన్న భార్య.. చంపించిన వృద్ధుడు
అతను ఆశించింది జరుగకపోవడంతో ఆమెకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడు. విడాకులివ్వాలంటే కోటి రూపాయలు ..
అతనికి 71 ఏళ్లు. ఆమెకు 35 ఏళ్లు. 45 ఏళ్ల కుమారుడిని చూసుకునేందుకు అతను ఆమెను పెళ్లాడాడు. మంచంలో ఉన్న కొడుకుని సరిగ్గా చూసుకోకపోవడంతో విడాకులు ఇవ్వాలనుకున్నాడు. అందుకు ఆమె కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంత డబ్బు ఇవ్వలేక ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించి.. మరో వ్యక్తితో హత్య చేయించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. రాజోరీ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఎస్ కే గుప్తాకు మంచం పట్టిన కొడుకు ఉన్నాడు. అతడిని చూసుకునేందుకు గతేడాది ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.
అతను ఆశించింది జరుగకపోవడంతో ఆమెకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడు. విడాకులివ్వాలంటే కోటి రూపాయలు కావాలని ఆమె గుప్తాను డిమాండ్ చేసింది. ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన గుప్తా.. కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే విపిన్ కు విషయం వివరించాడు. ఆమెను హత్య చేసేందుకు రూ.10 లక్షలకు డీల్ చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.2.5 లక్షలు గుప్తా.. విపిన్ కు చెల్లించాడు. బుధవారం (మే17) విపిన్ .. హిమాన్షు అనే మరో వ్యక్తితో కలిసి గుప్తా ఇంటిలో ఉన్న అతని భార్యను కత్తితో పొడిచి హత్యచేశారు.
పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఇంట్లోని ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. మహిళతో ఘర్షణ కారణంగా నిందితులకు గాయాలయ్యాయి. హత్య సమయంలో గుప్తా కొడుకు అమిత్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో.. విపిన్, హిమాన్షులతో పాటు గుప్తా, అతని కొడుకు అమిత్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story