Fri Nov 22 2024 21:43:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో శిల్పా చౌదరి.. లక్షకు రూ.10వేలు వడ్డీ ఇస్తానని చెప్పి..?
అనంతపురం ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న పద్మశ్రీ సిగ్మాసిక్స్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో సంస్థను తెరిచింది
తెలంగాణలో కిలాడీ లేడీ శిల్పా చౌదరి చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి ఆమె మోసాల చిట్టాలు. పెద్ద సెలబ్రిటీల కూతుర్లు, భార్యలే శిల్పా బుట్టలో పడి మోసపోయారు. ఇప్పుడు ఏపీలో మరో కన్నింగ్ లేడీ మోసం బయటపడింది. లక్షకు రూ.10 వేలు వడ్డీ ఇస్తానని ఆశచూపించి.. రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. సాదా సీదా మహిళకూడా కాదేమో.. ఇంకా ఈజీగా నమ్మేసి, ఆమె బుట్టలో పడ్డారు జనాలు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న పద్మశ్రీ సిగ్మాసిక్స్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక సంస్థను తెరిచింది. అధిక వడ్డీలతో జనానికి వల వేసింది. లక్ష రూపాయలు తనకు అప్పుగా ఇస్తే.. నెలకు రూ.10 వేలు వడ్డీ ఇస్తానని నమ్మబలికింది. పద్మశ్రీ మాటలను నమ్మిన వారంతా ఆమెకు డబ్బులిచ్చారు.
కన్నింగ్ లేడీ....
మొదట చెప్పినట్లుగానే వడ్డీ ఇవ్వడంతో ఆమెను మరింతగా నమ్మారు. ఆ తర్వాత తన అసలు ప్లాన్ ను అమలు పరిచింది. అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడం ఆలస్యం.. రాత్రికి రాత్రే ఊరు వదిలి జనం సొమ్ముతో పరారయింది. విషయం తెలుసుకున్న పద్మశ్రీ బాధితులు.. ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అధిక వడ్డీ వస్తుందని ఆశపడి..ఉన్నదంతా ఊడ్చి, ఒంటిపై నగలను కూడా అమ్మి పద్మశ్రీకి డబ్బులిస్తే.. తడిగుడ్డతో గొంతుకోసేసిందని వాపోయారు. ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు.. పద్మశ్రీ ఆచూకీ కనిపెట్టి, అరెస్ట్ చేసి, తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ స్నేహితురాలు షమీమ్ ద్వారా పరిచయమై డబ్బులు ఇచ్చినట్లు బాధిత మహిళలు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షమీమ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను కూడా పద్మశ్రీకి డబ్బులిచ్చి మోసపోయినట్లు తెలిపింది. పద్మశ్రీ తమ్ముడు మహేష్, అతని సతీమణి ప్రత్యూష కూడా రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లు దండుకున్నారని బాధితులు వాపోతున్నారు.
Next Story